AFG vs BAN: అఫ్గాన్‌ ప్లేయర్‌పై ‘చీటింగ్‌’ ఆరోపణలు.. ఆస్కార్‌ ఆర్టిస్ట్‌ అంటూ అశ్విన్‌ సెటైర్!

కీలకమైన సమయంలో అఫ్గానిస్థాన్‌ ఆటగాడు ‘గాయం’ నాటకాలు ఆడాడని.. ఇదంతా మోసమని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.

Published : 25 Jun 2024 13:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) అఫ్గానిస్థాన్‌ సంచలన ప్రదర్శన నమోదు చేసింది. సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి అఫ్గాన్‌ సెమీస్‌కు చేరుకుంది. అయితే, బంగ్లాతో మ్యాచ్‌ సందర్భంగా అఫ్గాన్‌ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ ప్రవర్తించిన తీరు నెట్టింట ట్రోలింగ్‌కు గురైంది. భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం అయిందంటే? 

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాపై అఫ్గాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అడపాదడపా ఆటంకాలు సృష్టించినా స్వల్ప లక్ష్యాన్ని అఫ్గాన్‌ కాపాడుకోగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌ 11.4 ఓవర్లప్పుడు చినుకులు వచ్చాయి. అప్పుడు ఆ జట్టు స్కోరు 81/7. ఆ వేళ వర్షం ఎక్కువై మ్యాచ్‌ ఆగిపోతే.. డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా 2 పరుగులు వెనకబడే ఉంది. నూర్‌అహ్మద్‌ ఆ ఓవర్‌ వేస్తున్నాడు. సడన్‌గా స్లిప్‌లో ఉన్న గుల్బాదిన్ కండరాలు పట్టేయడంతో అక్కడికక్కడే పడిపోయాడు. వెంటనే వైద్యబృందం వచ్చి పరీక్షించి అతడిని బయటకు తీసుకెళ్లింది. ఈలోగా వర్షం కూడా కాస్త పెరగడంతో మ్యాచ్‌ను నిలిపేశారు. ఒకవేళ ఆ కొద్ది సమయంలోనే మ్యాచ్‌ జరిగి బంగ్లా బౌండరీ కొట్టి ఉంటే.. ఆ తర్వాత వర్షం వల్ల రద్దైతే పరిస్థితి వేరేగా మారిపోయేది. కానీ, వర్షం మళ్లీ ఆగిపోవడంతో మ్యాచ్‌ కొనసాగింది. చివరికి అఫ్గాన్‌ విజయం సాధించింది. అయితే, గుల్బాదిన్ అలా ఒక్కసారిగా గాయపడినట్లు పడిపోవడంపై నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. అఫ్గాన్‌ కోచ్‌ జొనాథన్ ట్రాట్‌ డగౌట్ నుంచి సైగలు చేయడంతోనే నైబ్‌ అలా చేశాడని.. చీటింగ్‌ చేయాలనే ఉద్దేశం ఉందని ఆరోపణలు వినిపించాయి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత గుల్బాదిన్ అందరితో కలిసి సంబరాలు చేసుకోవడం గమనార్హం. వీటిపై అశ్విన్‌తోపాటు మైకెల్ వాన్‌ కూడా స్పందించాడు. 

‘‘గుల్బాదిన్‌ నైబ్‌కు రెడ్‌కార్డ్‌. బ్యాటింగ్‌, రన్నింగ్, స్లిప్‌ ఫీల్డింగ్‌, వికెట్ టేకింగ్‌’’ - అశ్విన్‌ పోస్టు చేస్తూ జబర్దస్త్‌లోని ‘సుడిగాలి సుధీర్‌’ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ మీమ్‌ను షేర్ చేశాడు. 

‘‘క్రికెట్‌ చరిత్రలో తొలి ఆటగాడిగా గుల్బాదిన్ నిలుస్తాడు. షాట్‌ కొట్టిన 25 నిమిషాల తర్వాత వికెట్‌ దక్కించుకున్న మొదటి క్రికెటర్’’ - మైకెల్ వాన్, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్

‘‘ఇది ఏమాత్రం అంగీకారం కాదు. అఫ్గానిస్థాన్‌ మోసం చేసింది. వర్షం పడే సమయంలో బంగ్లాదేశ్‌ 2 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. అలాంటి సమయంలో మ్యాచ్‌ను ఆపేందుకు అఫ్గాన్ ప్లేయర్లు ఇలా చేశారు’’ - ఓ క్రికెట్ అభిమాని

‘‘క్రికెట్‌లో ఇది ఫన్నీ సంఘటన. ఆటను నెమ్మదిగా సాగేలా కోచ్‌ చెప్పిన వెంటనే.. గుల్బాదిన్‌ అలా పడిపోవడం విచిత్రంగా ఉంది’’ - ఓ అభిమానిTags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని