AFG vs BAN: టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు అఫ్గాన్‌.. ఇంటిముఖం పట్టిన బంగ్లాదేశ్‌, ఆసీస్

అఫ్గానిస్థాన్‌ సంచలన ప్రదర్శన చేసింది. సూపర్‌-8 పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి తొలిసారి టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు దూసుకుపోయింది.

Updated : 27 Jun 2024 14:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఔట్.. అందులోనూ టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) ఫేవరేట్‌ టీముల్లో ఒకటైన ఆస్ట్రేలియాతోపాటు బంగ్లా నిష్క్రమించాయి. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అఫ్గానిస్థాన్‌ టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు దూసుకుపోయింది. దీంతో ఆసీస్, బంగ్లాదేశ్‌ ఇంటిముఖం పట్టాయి. సూపర్‌-8 గ్రూప్‌ 1 (Super 8) నుంచి భారత్‌తో పాటు అఫ్గాన్‌ సగర్వంగా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్లింది. గురువారం ఉదయం 6 గంటలకు దక్షిణాఫ్రికాతో తొలి సెమీస్‌లో అఫ్గాన్‌ తలపడనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీస్‌ జరగనుంది.

సూపర్-8లో మూడు జట్ల భవితవ్యం తేల్చే చివరి మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. పొట్టి కప్‌లో సంచలన విజయాలు నమోదు చేస్తూ వస్తున్న అఫ్గాన్‌ ఈసారి కూడా పట్టు వదల్లేదు. లక్ష్యం చిన్నదైనా సరే బంగ్లాను కట్టడి చేసి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్ 115/5 స్కోరు చేసింది. గుర్బాజ్ (43) టాప్‌ స్కోరర్. అతడితోపాటు ఇబ్రహీం జద్రాన్ (18), రషీద్ ఖాన్ (19*) విలువైన పరుగులు సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాను 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్‌ చేసింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. టార్గెట్‌ను 114 పరుగులుగా నిర్ణయించారు. అఫ్గాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రషీద్, నవీనుల్ అద్భుతం.. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిటన్ దాస్ (54) చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా తన జట్టును గెలిపించలేకపోయాడు. బంగ్లాదేశ్‌ నిష్క్రమణ 13 ఓవర్లప్పుడే తేలినా.. అఫ్గాన్‌ ఆశలకు గండి కొట్టేలా అనిపించింది. అయితే, కెప్టెన్ రషీద్‌ ఖాన్ (4/23), నవీనుల్ హక్ (4/26), ఫరూఖి (1/15), గుల్బాదిన్ (1/5) కీలక సమయంలో చెలరేగిపోయారు. బంగ్లాను ఒత్తిడికి గురి చేస్తూ వికెట్లు పడగొట్టారు. లిటన్‌తోపాటు సౌమ్యా సర్కార్ (10), తౌహిద్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నవీనుల్‌ హక్‌ (Naveen ul Haq) నిలిచాడు. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను అఫ్గాన్‌ ఓడించిన సంగతి తెలిసిందే.

ఆసీస్‌కు రెండు సార్లు షాక్‌లు..

సూపర్‌ 8 మ్యాచ్‌లో ఆస్ర్టేలియాపై సంచలన విజయం నమోదు చేసి అఫ్గాన్‌ తొలి షాక్ ఇచ్చింది. ఇప్పుడు బంగ్లాను ఓడించి సెమీస్‌కు దూసుకుపోవడంతో.. పరోక్షంగా ఆసీస్‌కు రెండోసారి షాకిచ్చినట్లైంది. దీంతో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది.


మ్యాచ్‌ అప్‌డేట్స్‌

  • అఫ్గానిస్థాన్‌ అద్భుతం చేసింది.
  • 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. 
  • బంగ్లాదేశ్‌ను 105 పరుగులకే ఆలౌట్‌ చేసింది.
  • దీంతో 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది.
  • దీంతో అఫ్గాన్‌ సెమీస్‌కు దూసుకుపోగా.. బంగ్లా, ఆసీస్‌ ఇంటిముఖం పట్టాయి.

  • అఫ్గానిస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు.
  • నవీనుల్‌ హక్ (17.4వ ఓవర్) బౌలింగ్‌లో తస్కిన్ (2) క్లీన్‌బౌల్డ్
  • ప్రస్తుతం బంగ్లా స్కోరు 105/9.
  • క్రీజ్‌లో లిటన్ దాస్ (54), ముస్తాఫిజుర్ ఉన్నారు.
  • ఒక్క వికెట్‌ తీస్తే అఫ్గాన్‌ సెమీస్‌కు చేరుతుంది.
  • ఇంకా 8 బంతుల్లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరం.

  • అఫ్గాన్-బంగ్లా మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది.
  • 12 బంతుల్లో 12 పరుగులు అవసరం.
  • క్రీజ్‌లో తస్కిన్, లిటన్ దాస్ (52*) ఉన్నారు.
  • ప్రస్తుతం బంగ్లా స్కోరు 17 ఓవర్లకు 102/8.
  • ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిస్తే.. ఆసీస్‌ సెమీస్‌కు వెళ్తుంది.

  • బంగ్లాదేశ్‌ మరో వికెట్‌ను కోల్పోయింది.
  • గుల్బాదిన్ బౌలింగ్‌లో (14.2వ ఓవర్) తన్జిమ్‌ భారీ షాట్‌కు యత్నించాడు.
  • తేలికైన క్యాచ్‌ను నబీ అందుకొన్నాడు.
  • దీంతో 92 పరుగుల వద్ద బంగ్లా వికెట్‌ను నష్టపోయింది.
  • క్రీజ్‌లో తస్కిన్, లిటన్ దాస్ (45*) ఉన్నారు.
  • లిటన్‌ను ఔట్ చేస్తేనే అఫ్గాన్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

  • టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌ రేసు నుంచి బంగ్లాదేశ్‌ ఔట్
  • ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో బంగ్లా విజయం సాధించిన సెమీస్‌కు చేరదు.
  • అయితే, అఫ్గాన్‌ విజయం సాధిస్తే మాత్రం సెమీస్‌కు వెళ్లిపోతుంది.
  • అలాకాకుండా బంగ్లా గెలిస్తే.. మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆసీస్‌ వెళ్తుంది.

  • మ్యాచ్‌ మళ్లీ ప్రారంభమైంది.
  • క్రీజ్‌లోకి తన్జిమ్‌, లిటన్ దాస్ వచ్చారు.
  • 12వ ఓవర్‌ను నూర్ అహ్మద్ పూర్తి చేశాడు.
  • మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదింపు
  • లక్ష్యం 114 పరుగులు.
  • ప్రస్తుతం బంగ్లా స్కోరు 12 ఓవర్లకు 82/7

  • మళ్లీ వర్షం వచ్చేసింది. 
  • మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.
  • ప్రస్తుతం బంగ్లాదేశ్ 11.4 ఓవర్లకు 81/7.
  • క్రీజ్‌లో లిటన్ దాస్ (37*), తన్జిమ్‌ ఉన్నారు.
  • బంగ్లా విజయానికి ఇంకా 50 బంతుల్లో 35 పరుగులు మాత్రమే కావాలి.
  • ప్రస్తుతానికి డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది.
  • ఈ సమయానికి 83 పరుగులు చేయాలి. ఇప్పుడు వర్షం ఇంకా పెద్దదై మ్యాచ్‌ రద్దైతే అఫ్గాన్‌ విజయం సాధిస్తుంది. సెమీస్‌కు వెళ్లిపోతుంది

  • బంగ్లాదేశ్‌కు వరుసగా షాక్‌లు తగిలాయి.
  • రషీద్ వెంటవెంటనే రెండు వికెట్లను పడగొట్టాడు.
  • తొలుత మహమ్మదుల్లా (6)ను వికెట్‌ కీపర్ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు.
  • అంపైర్‌ ఔట్ ఇవ్వకపోవడంతో అఫ్గాన్‌ డీఆర్‌ఎస్‌ తీసుకుంది.
  • సమీక్షలో ఫలితం అఫ్గాన్‌కు అనుకూలంగా వచ్చింది.
  • తర్వాత బంతికే రిషద్‌ను (0) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.
  • ప్రస్తుతం అఫ్గాన్‌ స్కోరు 11 ఓవర్లకు 80/7

  • బంగ్లాదేశ్‌కు మరో షాక్‌ తగిలింది.
  • దూకుడుగా ఆడిన తౌహిద్‌ (14) ఔటయ్యాడు.
  • రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో (8.2వ ఓవర్‌) తౌహిద్ భారీ షాట్‌కు యత్నించాడు.
  • బౌండరీ లైన్‌ వద్ద జద్రాన్‌కు దొరికపోయాడు. 
  • దీంతో 64 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.
  • ప్రస్తుతం బంగ్లా స్కోరు 9 ఓవర్లకు 73/5.
  • క్రీజ్‌లో లిటన్ దాస్ (34*), మహమ్మదుల్లా (1*) ఉన్నారు.

  • బంగ్లాదేశ్‌ నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
  • రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సౌమ్యా సర్కార్‌ (10) క్లీన్‌బౌల్డ్‌
  • ప్రస్తుతం 6.3 ఓవర్లలో బంగ్లా స్కోరు 48/4.

  • అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ పునఃప్రారంభమైంది.
  • ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్‌జరగనుంది.
  • ప్రస్తుతం బంగ్లా స్కోరు 31/3.
  • మరోసారి వర్షం పడి ఆటంకం కలిగితే మాత్రం ఓవర్ల కుదింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

  • మ్యాచ్‌కు వర్షం అంతరాయం
  • ప్రస్తుతం 3.2 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 31/3

  • బంగ్లాదేశ్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.
  • నవీనుల్‌ బౌలింగ్‌లో షాంటో, షకీబ్‌ వెనుదిరిగారు
  • మూడు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు 24/3

  • ఓపెనర్ తంజిద్ హసన్ (0)ను ఫరూఖి ఎల్బీ చేశాడు.
  • ఇన్నింగ్స్‌ 1.3వ ఓవర్‌లో అద్భుత బంతికి ఔట్ చేశాడు.
  • హసన్ డీఆర్‌ఎస్‌ తీసుకున్నా ఫలితం దక్కలేదు.
  • దీంతో 16 పరుగుల వద్ద బంగ్లా మొదటి వికెట్‌ను నష్టపోయింది.
  • అంతకుముందు తొలి ఓవర్‌లో బంగ్లా 13 పరుగులు రాబట్టింది.
  • ప్రస్తుతం బంగ్లా స్కోరు 2 ఓవర్లకు 18/1.

అఫ్గానిస్థాన్‌కు తొలి వికెట్ దక్కింది.


సెమీస్‌ అవకాశాలు ఇలా..

టీ20 ప్రపంచ కప్‌ గ్రూప్‌-1 నుంచి సెమీస్‌కు చేరే రెండో జట్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్‌ నాకౌట్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా జట్లు ఈ రేసులో ఉన్నాయి. ప్రస్తుతం అఫ్గాన్-బంగ్లా మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో అఫ్గాన్‌ గెలిస్తే.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆ జట్టు సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ బంగ్లా గెలిస్తే అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 20 ఓవర్లలో 115/5 స్కోరు చేసింది. దీంతో బంగ్లా ఎదుట 116 పరుగుల లక్ష్యం ఉంది. వేగంగా టార్గెట్‌ను ఛేదిస్తే బంగ్లా సెమీస్‌ చేరేందుకు అవకాశం ఉంటుంది.

ఇవీ సమీకరణాలు.. 

  • బంగ్లాదేశ్‌పై అఫ్గాన్‌ గెలిస్తే నెట్‌రన్‌రేట్‌ అవసరం లేకుండా సెమీస్‌ బెర్తు ఖాయం.
  • అఫ్గాన్‌ నిర్దేశించిన 116 పరుగులను బంగ్లాదేశ్‌ 12.1 ఓవర్లలో ఛేదిస్తే సెమీస్‌కు వెళ్లిపోతుంది. అప్పుడు అఫ్గాన్‌, ఆసీస్‌ ఇంటిముఖం పట్టక తప్పదు. 
  • లక్ష్య ఛేదనలో బంగ్లా 12.5 ఓవర్లలో 121 పరుగులు చేయాలి. అంటే 115 పరుగులు ఉన్నప్పుడు సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాలి. అదే ఫోర్‌ కొడితే 12.3 ఓవర్లలో 119 పరుగులు చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని