AUS vs AFG: పొట్టి ప్రపంచకప్‌లో మరో సంచలనం.. ఆసీస్‌ను ఓడించిన అఫ్గాన్‌

సూపర్‌-8లోని గ్రూప్‌ 1లో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాను ఓడించి అఫ్గానిస్థాన్‌ సంచలనం సృష్టించింది.

Updated : 23 Jun 2024 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఏంటా.. పొట్టి కప్‌ సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-1లో సెమీస్‌ రేసు చప్పగా సాగుతుందని భావించిన అభిమానులను అఫ్గానిస్థాన్‌ థ్రిల్‌కు గురిచేసింది. హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌ రేసును రసవత్తరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలిచి ఉంటే.. భారత్‌తోపాటు ఆ జట్టు నాకౌట్‌కు వెళ్లిపోయేది. కానీ, అఫ్గాన్‌ తాము కూడా రేసులో ఉన్నామంటూ గెలుపుతో సవాల్ విసిరింది.

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) మరో సంచలనం నమోదైంది. గ్రూప్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన అఫ్గాన్‌.. ఇప్పుడు సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసీస్‌పై విజయం సాధించడం అఫ్గాన్‌కిదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటి వరకు ఆరుసార్లు తలపడగా.. ఐదు మ్యాచుల్లో ఆసీస్‌దే గెలుపు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్‌ (3/28) టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా రెండో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. 

గుల్బాదిన్ సూపర్ బౌలింగ్‌

అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ వెనుకబడిపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59) రాణించినా.. మిగతా వారు విఫలం కావడంతో ఆసీస్‌ 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ (4/20) అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నవీనుల్ హక్ (3/20), నబీ (1/1), రషీద్ ఖాన్ (1/23), ఒమర్జాయ్‌ (1/10) మంచి ప్రదర్శన చేశారు. దీంతో గ్రూప్‌-1లో భారత్‌ రెండు విజయాలు సాధించి సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. ఆసీస్, అఫ్గాన్‌ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని