T20 world cup: అహో అఫ్గాన్‌

ఏం ప్రోత్సాహముందని! ఏం సౌకర్యాలున్నాయని! దేశమంతా అశాంతి.. బాంబుల మోత! ఎటు చూసినా హింసే. సాధారణ జీవనమే ఎంతో కష్టం. యుద్ధాలతో అతలాకుతలమైన ఆ దేశంలో కొన్నేళ్ల కింది వరకు సరదాగా అయినా వాళ్లు బ్యాట్లు పట్టుకోవడమే ఎక్కువ.

Published : 26 Jun 2024 02:56 IST

చరిత్ర సృష్టించిన రషీద్‌ బృందం
తొలిసారి ప్రపంచకప్‌ సెమీస్‌లో ప్రవేశం
ఉత్కంఠపోరులో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం
మెరిసిన రషీద్‌ ఖాన్, నవీనుల్, గుర్బాజ్‌ 

ఏం ప్రోత్సాహముందని! ఏం సౌకర్యాలున్నాయని! దేశమంతా అశాంతి.. బాంబుల మోత! ఎటు చూసినా హింసే. సాధారణ జీవనమే ఎంతో కష్టం. యుద్ధాలతో అతలాకుతలమైన ఆ దేశంలో కొన్నేళ్ల కింది వరకు సరదాగా అయినా వాళ్లు బ్యాట్లు పట్టుకోవడమే ఎక్కువ. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడడమే ఓ ఘనత. ఇక ప్రపంచకప్‌లో ఆడడమైతే ఓ కలే. అలాంటి స్థితి నుంచి అసాధారణ పట్టుదలతో ఒక్కొక్క మెట్టూ ఎదుగుతూ వచ్చిన అఫ్గానిస్థాన్‌.. ఇప్పుడు ఓ అద్భుతమే చేసింది. క్రికెట్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ.. మేటి జట్లను తోసిరాజంటూ.. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఉత్కంఠపోరులో అద్భుత పోరాటంతో బంగ్లాదేశ్‌ను ఓడించి రషీద్‌ ఖాన్‌ బృందం.. తన క్రికెట్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకుంది. అఫ్గానిస్థాన్‌లో సంబరాలు మిన్నంటాయి. వీధుల్లో పోటెత్తిన జనాల సంతోషానికి ఆకాశమే హద్దు. అఫ్ఘనుల చరిత్రాత్మక ప్రదర్శనతో ఆస్ట్రేలియా టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది.

కింగ్స్‌టౌన్‌

ఫ్గానిస్థాన్‌ మురిసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన వర్ష ప్రభావిత ఆఖరి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆ జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. రిషాద్‌ (3/26), తస్కిన్‌ (1/12), ముస్తాఫిజుర్‌ (1/17) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట అఫ్గాన్‌ 115/5కే పరిమితమైంది. గుర్బాజ్‌ (43; 55 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (19 నాటౌట్‌; 10 బంతుల్లో 3×6) ఆఖర్లో విలువైన పరుగులు చేశాడు. అఫ్గాన్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో స్వల్ప ఛేదనలో బంగ్లా తడబడింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులకు సవరించగా.. 5 వికెట్లకు 105 పరుగులే చేయగలిగింది. లిటన్‌ దాస్‌ (54 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 1×6) గొప్పగా పోరాడినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నవీనుల్‌ హక్‌ (4/26), రషీద్‌ ఖాన్‌ (4/23) బంగ్లా పతనాన్ని శాసించారు. ఈ విజయంతో గ్రూప్‌-లో రెండో స్థానంతో అఫ్గాన్‌ నాకౌట్స్‌కు అర్హత సాధించింది. ఆసీస్‌ మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఏ ఫార్మాట్లోనైనా ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరడం అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలిసారి.

ఊపేసిన ఉత్కంఠ: పిచ్‌ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్నప్పటికీ 115 పరుగుల స్కోరును కాపాడుకోవడం కష్టమైన పనే. కానీ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన అఫ్గాన్‌ బౌలర్లు.. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ, భాగస్వామ్యాలు నమోదు కాకుండా అడ్డుకుంటూ బంగ్లాదేశ్‌ను ఆద్యంతం ఒత్తిడిలో ఉంచారు. 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే సెమీస్‌ చేరే అవకాశమున్న బంగ్లా.. ధాటిగా ఆడడానికి ప్రయత్నించింది. కానీ చకచకా వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో తంజిద్‌ను ఔట్‌ చేయడం ద్వారా పతనాన్ని ఫారూఖీ ఆరంభిస్తే.. నవీనుల్‌ వరుస బంతుల్లో నజ్ముల్‌ శాంటో(5), షకిబ్‌ (0)లను ఔట్‌ చేసి ప్రత్యర్థిని గట్టి దెబ్బకొట్టాడు. మరోవైపు నుంచి వికెట్లు పోతున్నా లిటన్‌ దాస్‌ పట్టుదలగా నిలిచాడు. నాలుగో ఓవర్లో ఆటకు వర్షం అంతరాయం కలిగించే సమయానికి బంగ్లా 31/3తో నిలిచింది. ఆట తిరిగి మొదలయ్యాక సర్కార్‌ (10)ను, దూకుడుగా కనిపించిన తౌహిద్‌ (14; 9 బంతుల్లో 2×4)ను రషీద్‌ ఖాన్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేయడంతో బంగ్లా 64/5తో కష్టాల్లోకి కూరుకుపోయింది. కానీ దూకుడుగా ఆడే ప్రయత్నాన్ని మాత్రం మానలేదు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో లిటన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో ఆ జట్టు పైచేయి కొనసాగుతూనే ఉంది. కానీ 11వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌.. వరుస బంతుల్లో మహ్మదుల్లా (6), రిషాద్‌ (0)ను ఔట్‌ చేసి బంగ్లాకు షాకిచ్చాడు. ఆ జట్టు 80/7తో నిలవడంతో ఆట రసవత్తరంగా మారింది. తర్వాతి ఓవర్లో వర్షం రావడంతో లక్ష్యాన్ని సవరించారు. అఫ్గాన్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాపై తీవ్ర ఒత్తిడిని కొనసాగించింది. మూడు వికెట్లు చేతిలో ఉండగా.. బంగ్లా చివరి అయిదు ఓవర్లలో 23 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయితే లిటన్‌ దాస్‌ ఉన్నా ఆ జట్టుకు సింగిల్స్‌ తీయడమే కష్టమైపోయింది. అఫ్గాన్‌ వికెట్ల వేట కొనసాగించింది. తంజిమ్‌ (3)ను నైబ్‌ ఔట్‌ చేయగా.. నూర్‌ బౌలింగ్‌లో బౌండరీతో లిటన్‌ బంగ్లాను వేటలో నిలిపాడు. తస్కిన్‌తో కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. బంతి బంతికీ ఉత్కంఠ పెరుగుతూ పోయింది. ఆఖరి 9 బంతుల్లో బంగ్లా 9 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆట మరింత రసవత్తరంగా మారింది. కానీ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన నవీనుల్‌.. వరుస బంతుల్లో తస్కిన్, ముస్తాఫిజుర్‌లను ఔట్‌ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలకు హద్దేలేకుండా పోయింది.

అఫ్గాన్‌ కట్టడి: క్లిష్టమైన పిచ్‌పై పరుగుల కోసం అఫ్గానిస్థాన్‌ కూడా కష్టపడింది. ఆ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్‌ (18) పదో ఓవర్‌ వరకు వికెట్‌ పడనివ్వలేదు. కానీ 58 పరుగులే చేశారు. తర్వాతి ఓవర్లోనే జద్రాన్‌ ఔట్‌ కాగా.. రిషాద్‌ బౌలింగ్‌లో గుర్బాజ్‌ రెండు ఫోర్లు కొట్టాడు. అయినా పరుగుల వేగంలో పెద్దగా మార్పులేదు. 15 ఓవర్లకు 80/1. ఆ తర్వాత చకచకా 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌.. 18వ ఓవర్లో 93/5తో నిలిచింది. కానీ రషీద్‌ ఖాన్‌ పుణ్యమా అని 115 పరుగులకు చేరుకోగలిగింది. అతడు తస్కిన్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఆఖరి ఓవర్లో తంజిమ్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. చివరికి ఈ మెరుపులే మ్యాచ్‌లో కీలకమయ్యాయి.

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) సర్కార్‌ (బి) రిషాద్‌ 43; ఇబ్రహీం (సి) తంజిమ్‌ (బి) రిషాద్‌ 18; అజ్మతుల్లా (సి) లిటన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 10; నైబ్‌ (సి) సర్కార్‌ (బి) రిషాద్‌ 4; నబి (సి) శాంటో (బి) తస్కిన్‌ 1; జనత్‌ నాటౌట్‌ 7; రషీద్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 115; వికెట్ల పతనం: 1-59, 2-84, 3-88, 4-89, 5-93 బౌలింగ్‌: తంజిమ్‌ 4-0-36-0; తస్కిన్‌ 4-1-12-1; షకిబ్‌ 4-0-19-0; ముస్తాఫిజుర్‌ 4-0-17-1; రిషాద్‌ 4-0-26-3

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ 54 నాటౌట్‌; తంజిద్‌ హసన్‌ ఎల్బీ (బి) ఫారూకీ 0; నజ్ముల్‌ శాంటో (సి) నబి (బి) నవీనుల్‌ 5; షకిబ్‌ (సి) అండ్‌ (బి) నవీనుల్‌ 0; సౌమ్య సర్కార్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 10; తౌహిద్‌ (సి) ఇబ్రహీం జద్రాన్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 14; మహ్మదుల్లా (సి) ఇషాఖ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 6; రిషాద్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 0; తంజిమ్‌ (సి) నబి (బి) నైబ్‌ 3; తస్కిన్‌ (బి) నవీనుల్‌ 2; ముస్తాఫిజుర్‌ ఎల్బీ (బి) నవీనుల్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (17.5 ఓవర్లలో ఆలౌట్‌) 105; వికెట్ల పతనం: 1-16, 2-23, 3-23, 4-48, 5-64, 6-80, 7-80, 8-92, 9-105; బౌలింగ్‌: నవీనుల్‌ 3.5-0-26-4; ఫారూఖీ 2-0-15-1; నబి 2-0-15-0; రషీద్‌ 4-0-23-4; నూర్‌ 4-0-13-0; నైబ్‌ 2-0-5-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని