T20 World Cup 2024: సూపర్-8కి చేరిన అఫ్గాన్‌.. కివీస్‌ ఔట్.. రేసులో ఇంగ్లండ్‌

టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8 రేసు ఆసక్తికరంగా సాగుతోంది. కొన్ని టాప్‌ టీమ్‌లు ఇంటిముఖం పడుతుండగా.. మరికొన్ని పోరాడుతున్నాయి.

Updated : 14 Jun 2024 12:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) గ్రూప్‌-C నుంచి అఫ్గానిస్థాన్‌ సూపర్-8కి చేరుకుంది. ఇప్పటికే ఆతిథ్య వెస్టిండీస్‌ కూడా తుదిదశకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాపువా న్యూగినీపై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్‌ ప్రస్తుతం తన గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో న్యూజిలాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్‌లు ఇక నామమాత్రమే. ఉగాండా, పాపువా న్యూగినీ కూడా ఇంటిముఖం పట్టాయి. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంతో ఎవరు సూపర్ - 8లో ఆడతారనేది తేలాలంటే మాత్రం అఫ్గాన్‌-విండీస్‌ మ్యాచ్ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే. ఇందులో ఎవరు గెలిస్తే వారిదే టాప్‌ ప్లేస్. రెండు జట్లూ ఆరేసి పాయింట్లతో ఉన్నప్పటికీ.. నెట్‌రన్‌రేట్‌ కారణంగా అఫ్గాన్‌ ముందుంది.

రాణించిన గుల్బాదిన్

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూగినీ 19.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కిప్లిన్‌ డొరిగా (27) మాత్రమే కొద్దిసేపు నిలదొక్కుకున్నాడు. అతడితోపాటు టోని ఉరా (11), అలీ నావో (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అఫ్గాన్‌ బౌలర్ ఫరూఖి (3/16), నవీన్ ఉల్ హక్ (2/4), నూర్ అహ్మద్ (1/14) అదరగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో మాత్రం కష్టపడాల్సి వచ్చింది.  15.1 ఓవర్లలో మూడు వికెట్లను నష్టపోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు గుర్బాజ్ (11), ఇబ్రహీం జద్రాన్ (0) త్వరగా ఔటయ్యారు. అయితే, గుల్బాదిన్ నైబ్ (49*) ఓ వైపు క్రీజ్‌లో కుదురుకున్నాడు. ఒమర్జాయ్‌ (13), మహమ్మద్‌ నబీ (16*)తో కలిసి జట్టును గెలిపించాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఫరూఖి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. 

ఒమన్ 47 రన్స్‌కే ఆలౌట్.. ఇంగ్లండ్‌ ఘన విజయం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ మళ్లీ దుమ్మరేపింది. టీ20 ప్రపంచ కప్‌ గ్రూప్-B మ్యాచ్‌లో ఒమన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించి ‘సూపర్-8’ రేసులోకి దూసుకొచ్చింది. ఒమన్‌ను కేవలం 47 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఇంగ్లండ్‌  3.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (24*: 8 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), ఫిలిప్‌ సాల్ట్ (12: రెండు సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (8*: రెండు ఫోర్లు) దూకుడుగా ఆడారు. తొలుత ఇంగ్లండ్ బౌలర్లు అదిల్ రషీద్ (4/11), మార్క్‌ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) దెబ్బకు ఒమన్‌ బ్యాటర్లు విలవిల్లాడారు.

దీంతో ఇంగ్లండ్‌ (+3.081) నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచులను ఆడిన ఇంగ్లండ్‌ 3 పాయింట్లతో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో నమీబియాపై విజయం సాధించి.. మరోవైపు ఆసీస్‌ చేతిలో స్కాట్లాండ్‌ ఓడిపోతేనే ఇంగ్లండ్‌కు ‘సూపర్-8’ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ (+2.164) మూడు మ్యాచుల్లో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ఆసీస్‌ (6 పాయింట్లు) తదుపరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని