Non - Striker Runout: ‘నాన్‌ స్ట్రైకర్‌’ రనౌట్‌పై చర్చ‌.. మరోసారి స్పష్టతనిచ్చిన ఎంసీసీ

నాన్‌ స్ట్రైకర్ రనౌట్‌ (Non Striker Run Out) వివాదం కొనసాగుతోనే ఉంది. దీంతో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) కూడా స్పందించడం విశేషం. పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించింది.

Published : 20 Jan 2023 20:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల గత టీ20 ప్రపంచకప్‌ నుంచి మొన్న శ్రీలంకతో టీమ్‌ఇండియా తొలి వన్డేలో మహమ్మద్‌ షమీ చేసిన ‘నాన్‌స్ట్రైకర్‌’ రనౌట్‌ వరకూ సోషల్‌ మీడియాలో, పలు క్రీడా ఛానెళ్లలో చర్చ కొనసాగుతోనే ఉంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ను భారత బౌలర్ దీప్తి శర్మ ఇలానే రనౌట్‌ చేయడంపై అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడమ్‌ జంపా కూడా ఇలాగే ప్రయత్నించి విఫలం కాగా.. లంక కెప్టెన్‌ను షమీ ఔట్‌ చేసినా భారత్‌ అప్పీలును వెనక్కి తీసుకొంది. గత అక్టోబర్‌ వరకు దీనిని మన్కడింగ్‌గా అభివర్ణించేవారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమనే వ్యాఖ్యలు వినిపించేవి. అయితే మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అలాంటి ఔట్లను ‘నాన్‌ స్ట్రైకర్‌’ రనౌట్‌గా చట్టబద్ధం చేసింది. అయినా కూడా ఆందోళనలు, వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో ఎంసీసీ మరోసారి స్పష్టత ఇచ్చింది. 

‘‘కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై ఆటగాళ్లు, అంపైర్లకు మంచి అవగాహనే ఉంది. అయినా సరే గందోరగోళానికి దారితీసే పదాలతో ఇబ్బంది పడుతున్నట్లు మేం గుర్తించాం.. దానిని అంగీకరించాం. దీంతో మెరుగైన స్పష్టత ఇవ్వడానికి 38.3 చట్టంలోని పదాలను మార్చడానికి నిర్ణయించాం. బౌలర్‌ తన చేతిని అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లక ముందే నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ను దాటి ముందుకొచ్చినప్పుడు.. బౌలర్‌ వికెట్లను తాకిస్తే సదరు బ్యాటర్‌ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరతాడు. ఇప్పటికే ఇలాంటి చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. తాజాగా ఆన్‌లైన్‌లో చేసిన మార్పు కూడా 19వ తేదీ నుంచే అమల్లోకి వచ్చేసింది’’ అని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడమ్‌ జంపా తన బౌలింగ్‌ యాక్షన్‌ను దాదాపు పూర్తి చేసిన తర్వాత నాన్‌స్ట్రైకర్‌ను ఔట్‌ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అంపైర్లు దానిని నాటౌట్‌గా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని