Pak Cricket Team: మొన్న ఆర్మీ ట్రైనింగ్‌.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్‌పై ట్రోలింగ్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆర్మీ ట్రైనింగ్‌ అంటూ హంగామా చేసి పొట్టి కప్‌లో దారుణ పరాభవంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

Published : 04 Jul 2024 15:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆర్మీ తరహా ట్రైనింగ్‌తో పాకిస్థాన్‌ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) కోసం సిద్ధమయ్యారు. ట్రెక్కింగ్‌ చేయడం, అడవుల్లో, నదుల్లో నడుస్తూ సాధన చేశారు. తీరా, పొట్టి కప్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన పాక్‌ తీవ్ర విమర్శలపాలైంది. యూఎస్‌ఏ, భారత్‌ చేతిలో పరాభవంతో ఆ జట్టు ప్లేయర్లపై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్స్‌ వచ్చాయి. ఈ మాత్రం ప్రదర్శనకు ఆర్మీ ట్రైనింగ్‌ అవసరమా? అంటూ కామెంట్లు వచ్చాయి. పొట్టి కప్‌ ఓటమి ప్రభావం నుంచి బయటకొచ్చిన పాక్‌ ప్లేయర్లు గడాఫీ స్టేడియంలో మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అది కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాచ్‌లు ప్రాక్టీస్‌ చేస్తూ ఉన్న వీడియోలు బయటకొచ్చాయి. అందులో పాక్‌ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పాత పరుపుల మీద డైవ్‌ చేస్తూ క్యాచ్‌లు అందుకోవడం కనిపించింది. దీంతో పాక్‌ మారలేదని.. వారి ట్రైనింగ్‌ హాస్యాస్పదంగా ఉందని కామెంట్లు వచ్చాయి.

‘‘బంతి ఎప్పుడైనా సరే.. ఇద్దరు ఫీల్డర్లకు దగ్గరగా మాత్రమే వెళ్లాలి. అప్పుడే మా క్రికెటర్లు బంతిని అందుకోవడానికి ఇలా ప్రయత్నిస్తారు’’

‘‘పీసీబీ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో పాక్‌ ఆటగాళ్లు మరింత చులకన అవుతారు. పొట్టి కప్‌ ముందు కూడా ఇలాంటి చర్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి మార్పు రాలేదు’’

‘‘హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలో క్రికెట్‌ ధనిక క్రీడ. అలాంటిది ప్రొఫెషనల్స్‌ ఇలా పాత బెడ్‌లపై ప్రాక్టీస్‌ చేయడం ఏంటో అర్థం కావడం లేదు. పాక్‌ ఆడే తరువాత మ్యాచులకు మైదానమంతా వీటితోనే నింపేస్తారేమో’’

‘‘ఇలా మ్యాట్రెస్‌ మీద దూకడం కంటే.. మైదానంలోని గడ్డి మీద డైవ్ చేయడం బెటర్. ఇలా అయితే క్రికెట్‌లో మళ్లీ సక్సెస్ కావడం కష్టమే’’

రిజ్వాన్‌పై షహజాద్‌ తీవ్ర వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనపై వస్తున్న విమర్శలను డైవర్ట్‌ చేయడానికి రిజ్వాన్‌ అసందర్భ వ్యాఖ్యలు చేశాడని పాక్ వెటరన్ ఆటగాడు షహజాద్ విమర్శించాడు. ‘‘కొందరు టీ20 ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన చేశారు. అయితే, వారి ఆటను కప్పి పుచ్చుకోవడానికి ఇతర విషయాలను బయటకు తీసుకురావడం సరైంది కాదు. ఫిట్‌గా లేకుండా మైదానంలోకి దిగితే ఎలా ఆడగలరు? దీనికి కూడా కారణాలు వెతికితే వారిని ఏమనాలి?’’ అని షెహజాద్‌ ప్రశ్నించాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని