IND vs AUS: భారత్ X ఆసీస్‌ నాలుగో టెస్టు.. అహ్మదాబాద్‌ పిచ్‌ తీరేంటో..?

స్పిన్‌ పిచ్‌తో ఆసీస్‌ను ఇబ్బంది పెడదామని భావించిన టీమ్‌ఇండియా (Team India) మూడో టెస్టు మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో నాలుగో టెస్టుకు (IND vs AUS) పిచ్‌ సన్నద్ధతపై ఇరకాటంలో పడింది. 

Updated : 07 Mar 2023 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో టీమ్‌ఇండియా ((Team India) ఉండగా.. చివరి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఎలాంటి పిచ్‌ను తయారు చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొలి మూడు టెస్టుల్లో స్పిన్‌ ట్రాక్‌ వాడేసిన విషయం తెలిసిందే. అయితే, రెండు టెస్టుల్లో గెలిచిన టీమ్‌ఇండియాకు మూడో మ్యాచ్‌లో మాత్రం చుక్కెదురైంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుని.. నాలుగో టెస్టుకు ఫాస్ట్‌ బౌలింగ్‌ ట్రాక్‌ను సిద్ధం చేసుకోవాలని టీమ్‌ఇండియా తొలుత భావించింది.  తీరా, ఇప్పుడు విజయం కీలకం కావడంతో స్పిన్‌ పిచ్‌ను సిద్ధం చేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు పిచ్‌ పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం పిచ్‌కు సంబంధించిన ఫొటోలు దర్శనమిచ్చాయి. బీసీసీఐ నుంచి తమకెలాంటి సూచనలు రాలేదని గుజరాత్‌ క్రికెట్‌ అసోషియేషన్  క్యూరేటర్లు తెలిపారు. దీంతో అటు ఆసీస్‌, ఇటు భారత జట్టు శిబిరాలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో టాస్‌ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.  నాలుగో టెస్టుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బానెస్‌ హాజరవవుతారు.

క్రీజ్‌లో పాతుకుపోతే.. 

గత గణాంకాలను పరిశీలిస్తే..  అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉంది. స్టేడియం పునర్నిర్మాణం తర్వాత ఇక్కడ రెండు టెస్టులు జరిగాయి. ఆ రెండూ ఇంగ్లాండ్‌తోనే కావడం విశేషం. సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి లోకల్‌ బాయ్‌ అక్షర్‌ పటేల్‌ ఇంగ్లాండ్‌ను శాసించాడు. మొత్తం 40 వికెట్లలో 35 వికెట్లను వీరిద్దరే పడగొట్టారు. అలాగే ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ జో రూట్‌ కూడా పార్ట్‌టైమ్‌స్పిన్‌ బౌలింగ్‌తో ఐదు వికెట్ల (5/8) ప్రదర్శన చేయడం గమనార్హం. ఇటీవల రంజీ మ్యాచ్‌లో రైల్వేస్‌ జట్టు ఏకంగా 508 పరుగులు సాధించింది. కానీ, గుజరాత్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200+ పరుగులు సాధించి ఇన్నింగ్స్‌తేడాతో ఓటమిపాలైంది. కాబట్టి, బ్యాటర్ క్రీజ్‌లో పాతుకుపోతే మాత్రం పరుగులు సాధించడం పెద్ద కష్టం కాదని క్రికెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని