MS Dhoni: బంతి పట్టిన ధోనీ.. ఆశ్చర్యంలో అభిమానులు

హెలికాప్టర్‌ షాట్లు, వికెట్‌ కీపింగ్‌తో అదరగొట్టే చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ దోనీ బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా? ప్రస్తుతం ధోనీ అదే చేస్తున్నాడు. ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన అతడు చెపాక్‌ మైదానంలో బంతి పట్టుకొని బౌలింగ్‌ చేశాడు.

Updated : 24 Mar 2023 19:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో(IPL 2023) చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni) బౌలింగ్‌ చేయబోతున్నాడా అనే అనుమానం కలగక మానదు అతడి ప్రాక్టీస్‌ సెషన్స్‌ వీడియో చూస్తే. మరి ఈ సీజన్‌లో అతడేం అద్భుతం చేయబోతున్నాడో తెలియదు కానీ, చెపాక్‌ మైదానంలో మాత్రం బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ మేరకు వీడియోను సీఎస్‌కే(Chennai Super Kings) ఫ్రాంఛైజీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసింది. వీడియో చూస్తే అతడు నెట్స్‌లో సరదాగా గడిపాడని మాత్రం అర్థమవుతోంది. మామూలుగా ధోనీ బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడతాడనేది అందరి భావన. కానీ, అతడు బంతిని గింగిరాలు తిప్పుతూ బౌలింగ్‌ చేయడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  ఇది సీఎస్‌కే(CSK) పట్ల తనకున్న నిబద్ధతను, కష్టపడేతత్వాన్ని ప్రతిబింబిస్తోందని వీడియో చూసిన అభిమానులు భావిస్తున్నారు. ఓ వైపు ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అని కొందరు భావిస్తున్నారు. దీనిపై సీఎస్‌కే మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ స్పందించాడు. ధోనీ చాలా ఫిట్‌గా ఉన్నాడని అతడు మరో నాలుగేళ్ల వరకు ఆడగలడని అభిప్రాయపడ్డాడు.

ఇప్పటి వరకూ నాలుగు సార్లు టైటిల్‌ నెగ్గిన సీఎస్‌కే ఈసారి కూడా  టైటిల్‌పై కన్నేసింది. అందుకోసం వేలంలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌(Ben Stokes)ను దక్కించుకుంది. గత సీజన్‌లో అందుబాటులో లేని దీపక్‌ చాహర్‌(Deepak Chahar)ను తిరిగి సొంతం చేసుకుంది.  గాయం కారణంగా గత సీజన్‌లో కొన్ని మ్యాచులకు దూరమైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సైతం ఈ సీజన్‌లో అలరించనున్నాడు. జట్టుపై అభిమానుల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సారి ఎలాగైనా తమ అభిమాన జట్టు విజయం సాధించాలని ఆశిస్తున్నారు.  ఐపీఎల్ తొలి మ్యాచ్‌  చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 31న జరగనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని