Babar Azam: ఫ్యాన్స్‌ను మోసం చేశావు.. ఫ్రెండ్స్‌తో జట్టును నింపేశావు: బాబర్‌పై షహజాద్‌ ఆగ్రహం

ఎట్టకేలకు పాకిస్థాన్‌ విజయం సాధించింది. కెనడాను చిత్తు చేసి ‘సూపర్ - 8’ రేసులో కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Published : 12 Jun 2024 11:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) పాకిస్థాన్‌ రెండు మ్యాచ్‌లు ఓడి, ఒక దాంట్లో గెలిచింది. సూపర్ - 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మంచి స్కోరు చేసినా యూఎస్‌ఏ చేతిలో ఓడింది. అందరూ ఆసక్తిగా చూసే దాయాది పోరులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్‌ విఫలమైంది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కెప్టెన్‌ బాబర్ అజామ్‌పై వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు నాశనం కావడానికి సారథిగా అతడు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించాడు. పెద్ద మ్యాచుల్లో వ్యక్తిగత ప్రదర్శన చేయడంలోనూ బాబర్ వెనుకబడ్డాడని పేర్కొన్నాడు.

‘‘బాబర్‌ అజామ్‌ కెప్టెన్‌గా వచ్చినప్పటి నుంచి సాధారణ జట్లపైనా పాక్‌ ఓడిపోతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు బాధగానే ఉంది. కానీ, ఇలాంటి ఆటతీరునే మనం చూస్తున్నాం. సీనియర్లు జట్టును గెలిపించేందుకు బాధ్యత తీసుకోవాలి. కానీ, ఇక్కడ మాత్రం అలాంటిదేమీ కనిపించడంలేదు. గత నాలుగైదేళ్లుగా జట్టును కాపాడుతున్నామని భావిస్తున్న కొందరు.. కనీసం 120 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి క్రీజ్‌లో ఉండలేకపోయారు. భారత్‌ వంటి పెద్ద జట్టుపై విజయం ముఖ్యం కాదని భావించారా? ఇప్పుడున్న స్టార్లంతా బీ, సీ, డీ జట్లపై చెలరేగుతారు. అభిమానులను మోసం చేస్తూ గడిపేస్తున్నారు. మీ జీతాలు పెరిగాయి. వ్యక్తిగతంగా మీ ఆటను మెరుగుపర్చుకోవడానికి పీసీబీ బాగానే చెల్లిస్తోంది. 

ఇక కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ గణాంకాలను చూస్తే చాలా ఆశ్చర్యమేస్తోంది. అతడి సగటు కేవలం 27. స్ట్రైక్‌రేట్ 112 మాత్రమే. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా జట్టును గెలిపించడంలో మాత్రం వెనుకబడిపోయాడు. ఈ గణాంకాలను చూస్తే ఎవరు ‘కింగ్‌’ అనేది అర్థమవుతుంది. మ్యాచ్‌లను గెలిపించలేనప్పుడు ఈ ‘కింగ్‌’తో ఏం చేస్తాం? వ్యక్తిగత ఆటతీరుతోనే కాకుండా కెప్టెన్‌గా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలను మోసం చేస్తున్నావు. జట్టును నీ స్నేహితులతో నింపేస్తున్నావు. వారినే టీమ్‌లోకి తీసుకుంటున్నావు’’ అని షెహజాద్‌ విమర్శించాడు. పాక్‌ తరఫున 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అహ్మద్‌ షెహజాద్ ఇప్పటి వరకు 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టీ20ల్లో ఆడాడు. మొత్తం 6700కిపైగా పరుగులు చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని