Pakistan: మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్‌ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్‌ క్రికెటర్

టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్‌ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్‌ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 16 Jun 2024 00:06 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్థాన్‌ లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అమెరికా, భారత్‌ చేతుల్లో ఓడిన పాక్‌.. కెనడాపై నెగ్గింది. అమెరికా, ఐర్లాండ్‌ల మధ్య మ్యాచ్‌ వర్షం వల్ల రద్దవడంతో పాకిస్థాన్‌ సూపర్‌-8 కూడా అర్హత సాధించలేదు. దీంతో పాక్‌ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్ బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌, ఫకర్ జమాన్‌, హారిస్‌ రవూఫ్‌లపై ఆ దేశ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ తీవ్రంగా మండిపడ్డాడు. తగినంత సమయం ఇచ్చినా వారి ఆటతీరు మెరుగుపడలేదని, ఆ ఆటగాళ్లను వెంటనే తప్పించాలని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB)ని డిమాండ్ చేశాడు. 

‘‘గత 4-5 సంవత్సరాలుగా బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్ పాకిస్థాన్ తరపున రెగ్యులర్‌గా ఆడుతున్నారు. రాణించడానికి వారికి తగినంత సమయం ఇచ్చారు. జట్టులోని గ్రూపుల వల్ల వారు ఒకరినొకరు సమర్థించుకుంటూ మేం మా తప్పుల నుంచి నేర్చుకుంటున్నామని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ నాశనమైంది. బాబర్ అజామ్‌ 4-5 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, అతడు సాధించిందేమీ లేదు. ఆటతీరును మెరుగుపర్చుకోవడానికి తగినంత సమయం ఇచ్చినా ఏ మార్పు లేదు. అతడు సోషల్ మీడియాలో మాత్రమే కింగ్‌. బాబర్ అజామ్‌ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ కూడా సరిగ్గా లేవు. జట్టులో రాజకీయాలు చేస్తున్నాడు’’ అని అహ్మద్ షెహజాద్ వ్యాఖ్యానించాడు. 

యువ ఆటగాళ్లపై నిందలు వేయకుండా సీనియర్ ప్లేయర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని షెహజాద్‌ డిమాండ్ చేశాడు. ‘‘మొహసీన్‌ నక్వీ పీసీబీ ఛైర్మన్‌ అయిన తర్వాత రెండు పెద్ద తప్పులు చేశాడు. మొదటిది బాబర్‌ అజామ్‌ని మళ్లీ కెప్టెన్‌గా నియమించడం, రెండోది వాహబ్‌ రియాజ్‌ను చీఫ్‌ సెలెక్టర్‌గా చేయడం. నక్వీ తన నిర్ణయంలో చాలా అనైతికంగా వ్యవహరించాడు. జట్టులోని గ్రూపుల్లో భాగమైన ఈ 7-8 మంది ఆటగాళ్లను తొలగించొద్దని అతడిపై ఒత్తిడి ఉంది. ఆ ప్లేయర్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే పరిణామాలు మరింత దారుణంగా మారతాయి’’ అని అహ్మద్ షెహజాద్ అన్నాడు.   

జట్టులో మూడు గ్రూప్‌లు!

మరోవైపు, పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు జట్టు మూడు గ్రూప్‌లుగా విడిపోవడమే కారణమని తెలుస్తోంది. కెప్టెన్సీని కోల్పోవడంపై షహీన్ అఫ్రిది అసంతృప్తితో ఉన్నాడు. బాబర్ అజామ్‌ అతడికి మద్దతు ఇవ్వలేదు. తనను కెప్టెన్సీకి పరిగణించకపోవడంపై మహ్మద్‌ రిజ్వాన్‌ అసంతృప్తిగా ఉన్నాడు. ‘‘జట్టులో మూడు గ్రూపులు ఉన్నాయి. ఒకటి బాబర్ అజామ్ నేతృత్వంలో, రెండవది షహీన్ అఫ్రిది, మూడవది మహ్మద్ రిజ్వాన్ గ్రూప్‌. దీనికితోడు  మహ్మద్‌ అమీర్, ఇమాద్ వసీం వంటి సీనియర్లు పునరాగమనం చేయడం మరింత గందరగోళానికి దారితీసింది’’ అని పాక్‌ జట్టుకు సన్నిహితంగా ఉండే ఒకరు పీటీఐతో అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని