Ajaz Patel : అజాజ్‌ పటేల్‌ ‘పది వికెట్ల’ బంతికి అరుదైన గౌరవం

 దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన అజాజ్‌ పటేల్‌ ‘పది వికెట్ల’ బంతికి అరుదైన...

Published : 17 Dec 2021 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన అజాజ్‌ పటేల్‌ ‘పది వికెట్ల’ బంతికి అరుదైన గౌరవం దక్కనుంది. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్ (ఎంసీఏ) ఏర్పాటు చేస్తున్న మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పది వికెట్ల ప్రదర్శనకు కారణమైన బంతిని మ్యూజియం కోసం అజాజ్‌ పటేల్‌ ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌కు అందించాడు. ‘‘టెస్టు క్రికెట్‌లో అజాజ్ పటేల్‌ సాధించిన ఫీట్‌ అద్భుతమైంది. దిగ్గజ స్టేడియం వాంఖడేలో రికార్డు సృష్టించడం అతడికి జీవితాంతం గుర్తుండిపోతుంది. పది వికెట్ల ప్రదర్శన చేసిన తర్వాత ఆ బంతిని మాకు అందించాడు. దానిని ఆస్వాదించడానికి మధుర జ్ఞాపకంగా మారుస్తాం’’ అని పాటిల్ వివరించారు. 

అజాజ్‌ సూపర్‌ ఫీట్ బంతిని కొత్తగా  నిర్మిస్తున్న ఎంసీఏ మ్యూజియంలోని ‘ప్రైడ్‌ ఆఫ్ ప్లేస్‌’లో చోటు కల్పిస్తామని విజయ్‌ పాటిల్‌ వెల్లడించారు. అలానే మ్యూజియం నిర్మాణంపై మాట్లాడుతూ.. ‘‘ఇదొక మంచి నిర్ణయంగా భావిస్తున్నాం. ముంబయి క్రికెట్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. జాతీయ జట్టుకు ఎంపికై భారత్‌ తరఫున అంతర్జాతీయంగా చేసిన పరుగుల్లో ఐదో వంతు వాటిని ముంబయి నుంచి వచ్చిన బ్యాటర్లే చేశారు. కాబట్టే ముంబయి క్రికెట్‌ అసోసియేషన్ ఘనతను చాటి చెప్పేందుకు మ్యూజియం ఏర్పాటు ఆవశ్యకం’’ అని పాటిల్ వివరించారు. భవిష్యత్తు తరాల క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేలా రూపొందిస్తామని తెలిపారు. 

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ జరిగిన విషయం తెలిసిందే. ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో అజాజ్‌ పటేల్‌ (119/10) తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా అన్ని వికెట్లను పడగొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఆ మ్యాచ్‌లో కివీస్‌ ఓడిపోయిందనుకోండి.. అంతకుముందు టెస్టు క్రికెట్‌లో  ఒకే ఇన్నింగ్స్‌లో జిమ్ లేకర్ (1956), అనిల్‌ కుంబ్లే (1999) మాత్రమే పది వికెట్ల ప్రదర్శన చేశారు. మరో విశేషం ఏమిటంటే.. అజాజ్‌ పటేల్‌ జన్మించింది కూడానూ ముంబయిలోనే. అయితే అతడి చిన్నతనంలోనే కుటుంబం న్యూజిలాండ్‌కు తరలివెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని