Ajinkya Rahane: అడిలైడ్‌లో కోహ్లీ రనౌట్‌ను.. ఎప్పటికీ మర్చిపోలేను: రహానె

2020-2021 టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన భారత క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్లు లేకున్నా యువకులే ఆ సిరీస్‌ను...

Updated : 17 Jun 2022 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్: 2020-21 టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన భారత క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్లు లేకున్నా యువకులే ఆ సిరీస్‌ను 2-1 తేడాతో గెలిపించారు. ఆ సిరీస్‌లోని తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై చరిత్రలో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన భారత్‌.. ఆ తర్వాత మ్యాచుల్లో పుంజుకొంది. అయితే, టీమ్‌ఇండియా సరిగ్గా ఆడి ఉంటే తొలి మ్యాచ్‌ ఫలితం కూడా మరోలా ఉండేది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం సాధించినా రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది.

ఇక ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాటి వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె చేసిన తప్పిదం మ్యాచ్‌ గమనాన్నే మర్చేసింది. అతడు సారథి విరాట్‌ కోహ్లీ రనౌట్‌కు ఊహించని రీతిలో కారణమయ్యాడు. తొలుత 100 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియాను వీరిద్దరూ ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 88 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించి జట్టుకు భారీ స్కోర్‌ అందించేలా కనిపించారు. అప్పటికి కోహ్లీ (74; 180 బంతుల్లో 8x4) వడివడిగా శతకంవైపు అడుగులేస్తున్నాడు. అదే సమయంలో నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో మిడాన్‌ మీదుగా షాట్‌ ఆడిన రహానె (42; 92 బంతుల్లో 3x4, 1x6) సింగిల్‌ కోసం పిలుపు ఇచ్చాడు. వెంటనే స్పందించిన కోహ్లీ క్రీజువదిలి ముందుకు వెళ్లాడు. అయితే, మళ్లీ రహానె నిర్ణయం మార్చుకోవడంతో విరాట్‌ వెనుదిరిగాడు. అతడు క్రీజులోకి అడుగుపెట్టేసరికి రనౌటయ్యాడు. అప్పటికి టీమ్‌ఇండియా స్కోర్‌ 188/4గా నమోదైంది. తర్వాత 244 పరుగులకు ఆలౌటైంది.

ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రహానె.. ఆ రనౌట్‌ను తానెప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. లైయన్‌ వేసిన ఆ బంతి తన బ్యాట్‌కు ఎంత కచ్చితంగా తగిలిందో తాను సరిగ్గా అంచనావేయలేకపోయానని తెలిపాడు. దాంతో తేలిగ్గా సింగిల్‌ వస్తుందని భావించానన్నాడు. తర్వాత బంతిని చూస్తే జోష్‌ హేజిల్‌వుడ్‌ పక్కనే పడటంతో కోహ్లీని పరుగుకు రావద్దని వారించినట్లు గుర్తుచేసుకున్నాడు. అప్పటికే అతడు క్రీజు వదిలి బాగా ముందుకు రావడంతో రనౌటయ్యాడని పేర్కొన్నాడు. దీంతో అది గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని అప్పుడే ఊహించినట్లు రహానె పేర్కొన్నాడు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లాక కోహ్లీ వద్దకెళ్లి క్షమాపణ చెప్పినట్లు  వెల్లడించాడు. కోహ్లీ కూడా దాన్ని తేలిగ్గా తీసుకున్నాడని, ఆటలో ఇలాంటివన్నీ సహజమేనని, దాని గురించి ఆలోచించవద్దని చెప్పినట్లు రహానె చెప్పుకొచ్చాడు. అయినా, అది తన మదిలో మెదలాడుతూనే ఉన్నట్లు స్పష్టం చేశాడు. నాడు కోహ్లీ రనౌట్‌ కాకపోయి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని