
Ajinkya Rahane: అందుకే రహానెను ఎంపిక చేశారు : ఎమ్మెస్కే ప్రసాద్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానెకు విదేశాల్లో మెరుగైన రికార్డు ఉందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అందుకే త్వరలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లో అతడికి ఉన్న అనుభవం జట్టుకు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు.
‘విదేశీ పిచ్‌లపై రహానె మెరుగ్గా రాణించగలడు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిని దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. ప్రస్తుతం రహానె ఫామ్‌పై కొంత ఆందోళన నెలకొన్నా.. విదేశాల్లో అతడికున్న అనుభవం జట్టుకు కలిసొస్తుందన్న ఆలోచనతో బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఆటగాళ్లకు అండగా నిలిచినట్లే.. యువ ఆటగాళ్లను కూడా బీసీసీఐ ప్రోత్సహిస్తుంది. జట్టులో అందరికీ సమప్రాధాన్యం ఇస్తుంది. అప్పుడే జట్టులో సమతూకం వస్తుంది’ అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.
విదేశాల్లో రహానె 41.71 సగటుతో మూడు వేలకు పైగా పరుగులు చేశాడు. ప్రత్యేకించి సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కోహ్లీ (3,551 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రహానె (2,646 పరుగులు) నిలిచాడు. అయితే, గత కొద్ది కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న రహానె.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన మరో అవకాశాన్ని అతడు ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి! దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబరు 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.