Ajinkya Rahane : ఫామ్‌లోకి వచ్చిన రహానె.. అరుదైన ఘనత సాధించిన యశ్‌ ధుల్‌

టీమిండియా సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానె ఫామ్‌లోకి వచ్చాడు. సౌరాష్ట్ర, ముంబయి జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో రహానె (108 నాటౌట్‌: 250 బంతుల్లో 14×4,2×6) శతకంతో సత్తా..

Published : 18 Feb 2022 01:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమిండియా సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానె ఫామ్‌లోకి వచ్చాడు. సౌరాష్ట్ర, ముంబయి జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో రహానె (108 నాటౌట్‌: 250 బంతుల్లో 14×4,2×6) శతకంతో సత్తా చాటాడు. ముంబయి జట్టు తరఫున ఆడుతున్న రహానెకిది ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో 36వ శతకం. రహానె గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్‌ ఆడటంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (121 నాటౌట్‌: 219 బంతుల్లో 15×4, 2×6) కూడా సెంచరీ నమోదు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి జట్టు 263/3 స్కోరుతో నిలిచింది. ముంబయి కెప్టెన్ పృథ్వీ షా (1), ఆకర్షిత్ గొమెల్‌ (8), సచిన్ యాదవ్‌ (19) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు.

* సచిన్‌ సరసన యశ్ ధుల్‌..

అండర్‌-19 జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్ అరుదైన ఘనత సాధించాడు. రంజీ క్రికెట్లో అరంగేట్ర మ్యాచులోనే సెంచరీ నమోదు చేసి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ సరసన చేరాడు. తమిళనాడు, దిల్లీ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో.. యశ్ ధుల్ (113: 150 బంతుల్లో 18×4) శతకం నమోదు చేశాడు. ఇంతకు ముందు రోహిత్ శర్మ, పృథ్వీ షా, అమోల్ మజుందార్ తదితరులు రంజీ క్రికెట్లో అరంగేట్ర మ్యాచులోనే శతకాలు నమోదు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సరికి దిల్లీ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.

* మనీశ్‌ పాండే భారీ ఇన్నింగ్స్

కర్ణాటక, రైల్వేస్‌ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో.. కెప్టెన్‌ మనీశ్ పాండే (156: 121 బంతుల్లో 12×4,10×10) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఆటగాడు కృష్ణమూర్తి సిద్ధార్ద్‌ (140 నాటౌట్‌: 221 బంతుల్లో 17×4,2×6) శతకంతో రాణించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి కర్ణాటక జట్టు 392/5 స్కోరుతో నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని