Ajinkya Rahane: కెప్టెన్సీ.. రహానెపై అదనపు ఒత్తిడే: ఆకాశ్‌ చోప్రా

టీ20 ప్రపంచకప్‌ ముగిశాక న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. మూడు టీ20లు, రెండు టెస్టులను 

Published : 15 Nov 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ ముగిశాక న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. మూడు టీ20లు, రెండు టెస్టులను ఆడనుంది. టీ20 మ్యాచ్‌లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి అజింక్యా రహానెను సారథిగా నియమించింది. ఈ క్రమంలో రహానె ఫామ్‌, కెప్టెన్‌గా ఎంపికపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తనదైన శైలిలో విశ్లేషించాడు. బ్యాటర్‌గా సరైన ఫామ్‌లో లేనప్పుడు సారథ్యం బాధ్యతలు అప్పగించడం రహానెపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో రహానె పరుగులు చేయకపోతే.. ఇంగ్లాండ్‌తో ఆఖరి (వాయిదాపడిన టెస్టును నిర్వహిస్తే) టెస్టుకు అతడి ఎంపికపై ప్రశ్నలు వస్తాయని వివరించాడు. 

‘‘కివీస్‌తో తొలి టెస్టుకు రహానెను కెప్టెన్‌గా నియమించారు. నిజాయితీగా చెప్పాలంటే.. ఇది రహానెపై అదనపు ఒత్తిడి పెట్టడమే. ఈ మ్యాచ్‌తోపాటు సిరీస్‌లోనూ అజింక్యా పరుగులు చేయాలి. లేకపోతే ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు (రీషెడ్యూల్‌ చేసే మ్యాచ్‌) కోసం జట్టులోకి రహానెను తీసుకోవడంపై ప్రశ్నలు వెలువెత్తే అవకాశం ఉంది. అలానే గత రెండేళ్ల నుంచి రహానె ఫామ్‌ ఏమంత గొప్పగా లేదు. పెద్ద ఇన్నింగ్స్‌లూ లేవు. యావరేజ్‌ కూడా దారుణంగా పడిపోయింది. రాబోయే సిరీస్‌ రహానెకు ఎంతో కీలకం. కెప్టెన్సీపరంగానే కాకుండా ఆటగాడిగా పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది’’అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.  రహానె గత 15 టెస్టుల్లో 24.76 సగటుతో కేవలం 644 పరుగులు మాత్రమే సాధించాడు. తొలి టెస్టుకు (నవంబర్ 25- నవంబర్‌29) విరాట్ విశ్రాంతి తీసుకోగా.. వాంఖడే స్టేడియంలో జరిగే రెండో టెస్టుకు (డిసెంబర్ 3-డిసెంబర్ 7) అందుబాటులోకి రానున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని