Published : 01 Dec 2021 01:44 IST

Ajinkya Rahane : జట్టులో స్థానం కోసం రహానెకు యువ క్రికెటర్ల నుంచి తీవ్ర పోటీ

బ్యాటర్‌గా గత రెండేళ్ల ప్రదర్శన అంతంతమాత్రమే

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజింక్య రహానె.. భారత టెస్టు జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి సహాయకుడిగా (వైస్‌ కెప్టెన్‌గా) ఉండే మిడిలార్డర్‌ బ్యాటర్‌. ఎంత ఒత్తిడినైనా తనలో కనిపించనీయకుండా కోహ్లీ గైర్హాజరీలో ప్రశాంతంగా జట్టును నడిపించే కెప్టెన్‌.. సారథిగా టీమ్‌ గెలుపోటముల సంగతిపక్కనపెడితే.. ఆటగాడిగా విఫలమవుతున్న అజింక్య రహానెకు యువ క్రికెటర్ల నుంచి పోటీ తప్పేలా లేదు. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ తానేంటో నిరూపించుకోగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ వేచి చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే చాలా సార్లు అవకాశాలు వచ్చినా నిలబెట్టుకోలేదనే అపవాదు రహానెపై ఉంది. ఈ క్రమంలో రహానె గత రెండేళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే..?

పుజారాతోపాటు అజింక్య రహానె క్రీజ్‌లో ఉన్నాడంటే అభిమానులకు అదొక భరోసా. ఎంతటి భీకరమైన బౌలింగ్‌నైనా కాచుకుంటారులే అనే ధీమా. సీజన్‌ సీజన్‌కు తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకుంటూ జట్టుకు ఉప నాయకుడిగా ఎదిగిన అజింక్య రహానె అప్పుడప్పుడు సారథిగానూ టీమ్‌ఇండియాను నడిపించాడు. అయితే ఆటగాడిగా మాత్రం గత రెండేళ్ల నుంచి మాత్రం రాణించలేకపోతున్నాడు. దానికి అజింక్య గణాంకాలే సాక్ష్యం.. 2013లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన రహానె తన కెరీర్‌లో ఇప్పటి వరకు 80 టెస్టులు ఆడాడు. అయితే 39.27 సగటుతో 4,830 పరుగులు సాధించాడు. వీటిలో పన్నెండు శతకాలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట వరకు అద్భుతంగా ఆడిన రహానె.. 2020, 2021 ఏడాదిలో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శనను ఇవ్వలేకపోయాడు. గతేడాది ఆసీస్‌పై సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు లేకపోవడం గమనార్హం. గత సంవత్సరం (2020)లో నాలుగు టెస్టులు ఆడిన రహానె 38.86 సగటుతో 272 పరుగులు చేశాడు. అందులో ఒకే ఒక్క శతకం మాత్రమే ఉంది. అత్యధిక స్కోరు 112 పరుగులు. ఈ ఏడాది కూడానూ పెద్దగా రాణించిదేమీ లేదు. 2021లో ఇప్పటివరకు 13 టెస్టులు ఆడిన అజింక్య 19.57 సగటుతో కేవలం 450 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండే అర్ధశతకాలు ఉండటం గమనార్హం. 

కివీస్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రహానె టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా జట్టు విజయం కోసం ప్రణాళికలను సరిగ్గానే అమలు పరిచినా.. బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 39 (35,4) పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆదుకోకుండా త్వరగా ఔట్‌ అయిపోయాడు. మరోవైపు అరంగేట్ర బ్యాటర్ శ్రేయస్‌ శతకం, అర్ధశతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో రెండో టెస్టు మ్యాచ్‌కు విరాట్‌ కోహ్లీ వచ్చేస్తున్నాడు. సీనియర్‌ బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్‌ అయిన రహానెను పక్కన పెట్టాలా?.. అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయస్‌ను ఉంచాలా? అనే దానిపై మేనేజ్‌మెంట్‌ తర్జనభర్జనలు పడుతోంది. ఒక వేళ శ్రేయస్‌ తుది జట్టులో వచ్చి.. ఆ మ్యాచ్‌లోనూ యువ బ్యాటర్‌ రాణిస్తే మాత్రం జట్టులో రహానె స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. వైస్‌ కెప్టెన్‌గా కాదు కదా.. ఆటగాడిగానూ తుది జట్టులోకి రావడం కష్టమే అవుతుంది. అదృష్టం బాగుండి రెండో టెస్టుకు రహానె ఎంపికైతే దానిని సద్వినియోగం చేసుకోవాల్సిందే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని