INDIA vs PAK: పాక్‌తో ముప్పు లేదన్న అగార్కర్.. పంత్‌పై పాక్‌ క్రికెటర్‌ కామెంట్స్‌

పాక్‌తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్న అజిత్‌ అగార్కరర్‌

Published : 18 Oct 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే. ఏ జట్టు గెలుస్తుంది? ఎవరు బాగా ఆడతారనే విషయాల మీద ఇరు దేశాల అభిమానులు, క్రీడాకారులు చర్చించుకుంటూనే ఉంటారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న పాక్‌తో టీమిండియా తలపడనుంది. భారత్‌ ఫేవరేట్‌ జట్టుగా బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలో పాక్‌ను తక్కువ అంచనా వేయొద్దని భారత మాజీ పేసర్‌ అజిత్‌ అగర్కార్‌ టీమిండియాకు సూచించాడు. ‘క్లాస్‌ ఆఫ్‌ 2007’ కార్యక్రమంలో అగర్కార్‌ మాట్లాడుతూ.. ‘‘పాక్‌తో భారత్‌కు పెద్ద ముప్పేమీ ఉండకపోవచ్చు. అయితే దాయాది దేశాన్ని తక్కువ అంచనా వేయకూడదు. రెండు దేశాల మధ్య మ్యాచ్‌ అంటేనే భావోద్వేగంతో కూడుకున్నది. అయితే ప్రతిసారీ టీమిండియానే పైచేయి సాధించింది. ఫామ్‌ను బట్టి చూస్తే ఇప్పుడు కూడా భారత్‌ జట్టుదే ఆధిక్యం ఉంటుంది. పాకిస్థాన్‌ సరైన సవాల్‌ను విసరకపోవచ్చు. అలా అని పొరుగు దేశం జట్టును తక్కువ అంచనా వేయకుండా నాణ్యమైన ఆటను ప్రదర్శించాలి’’అని సూచించారు. 2007 టీ20 ప్రపంచకప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లమైన తాము ఆ రోజు కప్‌ను సాధిస్తామని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. 


పంత్‌.. కాస్త ఆలోచించి ఆడు: సల్మాన్‌ భట్‌

భారత వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ కాస్త పరిణతితో ఆలోచించి ఆడాల్సిన అవసరం ఉందని పాక్ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘పంత్‌ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు. అయితే పరిణతితో ఆడాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి పంత్‌ మూడ్‌ మారిపోతుంటుంది. భారీ షాట్లు ఆడేందుకు దూకుడుగా ముందుకు వస్తుంటాడు. మొదటి బంతి నుంచే ఇలా చేస్తుంటాడు. బౌలర్లకు దొరికిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి షాట్లు కొట్టాలి’’ అని సల్మాన్‌ భట్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని