Akash Madhwal: నాడు స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ లీగుల నుంచి మధ్వాల్‌ను బ్యాన్ చేశారట.. ఎందుకంటే..?

ముంబయి ఇండియన్స్‌ సంచలన బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌(Akash Madhwal) టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడే రోజులను అతడి సోదరుడు గుర్తుచేసుకున్నాడు.

Updated : 26 May 2023 13:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : లఖ్‌నవూ(Lucknow Supergiants)పై అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌(Akash Madhwal)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కీలక మ్యాచ్‌లో కేవలం ఐదే పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి ముంబయికి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ఈ సంచలన బౌలర్‌. ముంబయి(Mumbai Indians) జట్టుకు మరో రత్నం దొరికిందని పలువురు మెచ్చుకుంటుండగా.. మధ్వాల్‌ సోదరుడు ఆశిష్‌ అతడి క్రికెట్‌ నేపథ్యం పై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన స్వగ్రామంలో మధ్వాల్‌ను క్రికెట్‌ ఆడకుండా బ్యాన్‌ చేశారని.. ఎందుకంటే వారికి అతడు చాలా ప్రమాదకరంగా మారాడని వివరించాడు. 

మధ్వాల్‌ ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం వెనక కెప్టెన్‌ రోహిత్‌(Rohit Sharma) పాత్ర ఎంతో ఉందని ఆశిష్‌ ఓ ఛానల్‌ చాట్‌లో పలు విషయాలు వెల్లడించాడు. ‘రోహిత్‌ తన ఆటగాళ్లపై ఎంతో విశ్వాసం ఉంచి అవకాశాలు ఇస్తాడు. కొత్త ఆటగాడు ఎప్పుడూ జట్టులో తన స్థానం గురించి కలవరపడతాడు. అయితే.. రోహిత్‌ ఆ భయాలను తొలగించడంతో ఆకాశ్‌ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని ఆశిష్‌ వివరించాడు.

‘ఆకాశ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి జాబ్‌ చేస్తున్నప్పుడు.. అతడి స్నేహితులు వచ్చి.. ఈ రోజు ఉద్యోగానికి వెళ్లొద్దు.. మా టీమ్‌ తరఫున వచ్చి ఆడు.. మేమే డబ్బులు ఇస్తాం అని అడిగేవారు. ఆ తర్వాత అతడు లెదర్‌ బాల్‌ క్రికెట్‌కు మారాడు’ అని ఆకాశ్‌ స్థానిక స్నేహితుడు ఈ చాట్‌లో పలు విషయాలు పంచుకున్నాడు. మధ్వాల్‌ తొలుత టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన విషయం తెలిసిందే.

మధ్వాల్‌ అద్భుతంగా బంతులేసేవాడని.. అతడిని ఎదుర్కోవడానికి భయపడి.. లోకల్‌ టోర్నమెంట్ల నుంచి అతడిని నిషేధించారని సోదరుడు ఆశిష్‌ తెలిపాడు. ఆ తర్వాత రూర్కీ బయటకు వెళ్లి ఆడేవాడని చెప్పాడు. ప్రస్తుతం తన సోదరుడికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ‘అతడి టెన్నిస్‌ బాల్‌ రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతడి టెన్షన్‌లో సగం రోహిత్‌ శర్మ తీసుకుంటాడు. వారి మధ్య బంధం అలాంటిది’ అని ఆశిష్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని