INDvsSL: ప్రేమదాసలోనే మ్యాచులన్ని

పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసు కోసం టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. జులైలో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు,....

Published : 11 May 2021 23:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసు కోసం టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. జులైలో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల్లో తలపడనుంది. ఈ మ్యాచులన్నిటినీ ఒకే వేదికలో నిర్వహించనున్నారు. కొలంబో నగరంలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంక క్రికెట్‌ పాలక కమిటీ ఛైర్మన్‌ అర్జున డి సిల్వా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

వాస్తవంగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి వంటి సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. అదే సమయంలో తెల్ల బంతి క్రికెట్‌ స్పెషలిస్టుల జట్టు శ్రీలంకకు వెళ్లనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూలును పూర్తి చేసేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా మూడేళ్ల తర్వాత టీమ్ఇండియా లంకలో పర్యటిస్తోంది. జులై 13 నుంచి 27 వరకు మ్యాచులు ఉంటాయని తెలుస్తోంది.

‘పూర్తి సిరీసును ఒకే వేదికలో నిర్వహించాలని అనుకుంటున్నాం. ఇప్పటికైతే ప్రేమదాస స్టేడియాన్ని వేదికగా ఖరారు చేశాం. మ్యాచులు జరిగే నాటికి పరిస్థితిని అనుసరించి వేదిక మార్పు ఉంటుంది. ఇక నిబంధనల ప్రకారం ఆటగాళ్లు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. తొలి మూడు రోజులు కఠినంగా ఉంటుంది. తర్వాతి నాలుగు రోజుల్లో సాధన చేసుకొనేందుకు అనుమతిస్తాం. గతంలో ఇంగ్లాండ్‌, బంగ్లా సిరీసుల కోసం బయో బుడగ పర్యవేక్షణకు శ్రీలంక సైన్యం సాయం తీసుకున్నాం. మాకింకా ఆరోగ్యశాఖ సహకారం ఉంది. మా బృందంలో 10 మంది వైద్యులు ఉన్నారు. ఇంగ్లాండ్‌ సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడూ అవే నిబంధనలు పాటిస్తాం’ అని డిసిల్వా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని