T20 World Cup: హార్దిక్‌ పాండ్యను గేలి చేసిన నోళ్లే..

హార్దిక్‌ మైదానంలో అడుగుపెడితే గేలి చేయడం.. ముంబయి కెప్టెన్‌గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం.. ఆల్‌రౌండర్‌గా విఫలమవడంతో విపరీతంగా విమర్శించడం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిందిదే.

Updated : 23 Jun 2024 11:07 IST

హార్దిక్‌ మైదానంలో అడుగుపెడితే గేలి చేయడం.. ముంబయి కెప్టెన్‌గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం.. ఆల్‌రౌండర్‌గా విఫలమవడంతో విపరీతంగా విమర్శించడం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిందిదే. కానీ ఇప్పుడు అతని బ్యాటింగ్‌ అద్భుతమంటూ.. అతని బౌలింగ్‌ అదుర్స్‌ అంటూ పొగడ్తలు. టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేస్తూన్నాడంటూ ప్రశంసలు. ఈ తేడాకు కారణం హార్దిక్‌ కష్టం. ఈ మార్పునకు కారణం అతని దృఢ సంకల్పం. హార్దిక్‌ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా పీడకల లాంటి ఆ ఐపీఎల్‌ అనుభవం నుంచి ఇంత త్వరగా కోలుకుని, తిరిగి సత్తాచాటేవాడు కాదేమో! ఈ సీజన్‌కు ముందు రోహిత్‌ స్థానంలో హార్దిక్‌కు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ అప్పజెప్పడంతో ఆ జట్టు, హిట్‌మ్యాన్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి ప్రదర్శించారు. ఆ అసహనాన్ని హార్దిక్‌పై చూపించారు. అతని సారథ్యంలో జట్టు కూడా పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగానూ హార్దిక్‌ విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేయడంతో పాటు కేవలం 11 వికెట్లే పడగొట్టాడు. దీంతో హార్దిక్‌కు ప్రపంచకప్‌లో చోటు దక్కడమూ సందేహంగా మారింది. కానీ అతని నైపుణ్యాలపై నమ్మకముంచిన అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఓ అవకాశం ఇచ్చింది. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు వేరే హార్దిక్‌ను చూస్తామని, అతను పుంజుకుంటాడని ఈ టోర్నీ ఆరంభానికి ముందు మాజీలు అభిప్రాయపడ్డారు. ఆ మాటలను నిజం చేస్తూ హార్దిక్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూర్తి ఆత్మవిశ్వాంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఐర్లాండ్‌పై 3 వికెట్లు పడగొట్టిన అతను.. ఆ తర్వాత పాకిస్థాన్, అమెరికాపై రెండేసి వికెట్ల ప్రదర్శన చేశాడు. అఫ్గానిస్థాన్‌తో పోరులో బ్యాటింగ్‌లో 32 పరుగులు సాధించాడు. ఇప్పుడు బంగ్లాతో మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండర్‌గా మెరిసి జట్టును సెమీస్‌కు చేరువ చేశాడు. బ్యాటింగ్‌లో కీలకమైన అర్ధశతకంతో జట్టు భారీ స్కోరు సాధించేలా చూశాడు. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. హార్దిక్‌ ఇదే నిలకడ కొనసాగిస్తే కప్‌ దిశగా జట్టు ప్రయాణం సాఫీగా సాగే ఆస్కారముంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని