Washington Sundar: వాషింగ్టన్‌ సుందర్‌కు గాయం.. జింబాబ్వే పర్యటనకు అనుమానమే..!

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. బుధవారం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో సుందర్‌ భుజానికి

Published : 11 Aug 2022 23:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. బుధవారం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో సుందర్‌ భుజానికి బలమైన గాయమైంది. ఫీల్డింగ్‌ చేస్తోన్న సమయంలో కిందపడటంతో అతడు గాయపడ్డాడు. దీంతో సుందర్‌ ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ గాయం తీవ్రతపై స్పష్టత లేనప్పటికీ.. జింబాబ్వే పర్యటనకు అతడు వెళ్లడం అనుమానంగానే కన్పిస్తోంది.

ఆగస్టు 18 నుంచి టీమిండియా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సీనియర్‌ ఆటగాళ్లైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, భువనేశ్వర్‌, మహమ్మద్‌ షమీ, బుమ్రాలతో పాటు రిషభ్ పంత్‌కు విశ్రాంతినివ్వడంతో కొత్తగా దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు జట్టులో అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్‌లకు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అయితే తాజాగా సుందర్‌కు గాయమవడంతో అతడు జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశాలు కన్పించట్లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది టీ20 మెగా టోర్నీలో హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడి అద్భుత ప్రదర్శన చేసిన సుందర్‌.. గత కొన్ని నెలలుగా వన్డేలు ఆడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు చివరిసారిగా ఆడాడు. ఆ తర్వాత వరుసగా గాయాలవడంతో విండీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజులు విరామం తీసుకున్న సుందర్‌.. ఇటీవల ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. లాంకషైర్‌ జట్టు తరఫున కౌంటీ డివిజన్‌లో రెండు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 8 వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని