Chess: ఈసారి వ్యాఖ్యాతగా

ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతను.. ఈ సారి మాత్రం పోటీల కోసం చెస్‌ సాధన

Updated : 13 Nov 2021 08:50 IST

చెన్నై: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతను.. ఈ సారి మాత్రం పోటీల కోసం చెస్‌ సాధన చేయడం లేదు. అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఎత్తులు వేయడం కంటే కూడా మాటలపై దృష్టి సారించాడు. ప్రత్యర్థిని కట్టడి చేయడం కంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడంపై ధ్యాస పెట్టాడు. ఎందుకంటే అతను ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆటగాడిగా పోటీపడడం లేదు.. వ్యాఖ్యాతగా కనిపించనున్నాడు. ఇప్పటికే కొన్ని అంతర్జాల చెస్‌ టోర్నీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషీ.. ఇప్పుడు తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం సిద్ధమయ్యాడు. ఈ నెల 24 నుంచి డిసెంబర్‌ 16 వరకు దుబాయ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ (నార్వే), రష్యా గ్రాండ్‌మాస్టర్‌ నెపోమియాచి మధ్య ఈ టైటిల్‌ పోరు జరుగుతుంది. దీనికి అధికారిక వ్యాఖ్యాతల్లో ఒకడిగా విషీ వ్యవహరించనున్నాడు. ‘‘ఇదెంతో సరదాగా ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పటికే ఆన్‌లైన్‌లో కొన్ని టోర్నీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆ పాత్ర పోషించేందుకు ఎదురు చూస్తున్నా. వ్యాఖ్యానం చేస్తారా అని ఫిడే అడగ్గానే.. ఎందుకు ప్రయత్నించకూడదనుకున్నా. ఇదెంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎలా ఆడతానో అనే ఒత్తిడి లేకుండా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు వెళ్లేందుకు ఆత్రుతగా ఉన్నా. ఫామ్‌లో ఉన్న కార్ల్‌సన్‌ ఫేవరేట్‌గా కనిపిస్తున్నాడు. నెపోమియాచి కూడా గట్టి పోటీనివ్వగలడు’’ అని ఆనంద్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని