Anand Mahindra: ‘అందుకే ఆయనో రోల్‌ మోడల్‌’.. ద్రవిడ్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

బీసీసీఐ తనకు ప్రకటించిన బోనస్‌పై భారత మాజీ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తీసుకున్న కీలక నిర్ణయంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. 

Updated : 11 Jul 2024 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన బోనస్‌ విషయంలో భారత మాజీ ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid) తీసుకున్న కీలక నిర్ణయం ఎంతోమందిలో స్ఫూర్తి కలిగిస్తోంది. ఆయన తీసుకున్న నిర్ణయంపై తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

‘‘ఈ వ్యక్తి విలక్షణానికి ప్రతీక. అందుకే ఆయన ఎంతోమందికి రోల్‌మోడల్‌ అయ్యారు’’ అని ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ద్రవిడ్‌ లాంటి వ్యక్తులు అరుదు. అందరికీ ఇలాంటి మనసు ఉండదు’’ అని ఒకరు.. ‘‘ఆయన ఒక లెజెండ్‌. నా క్రికెట్‌ హీరో’’.. ‘‘దేశానికి ఇలాంటి వాళ్లు కావాలి. ఆయన దగ్గర కోచింగ్‌ తీసుకున్న ఆటగాళ్లు నిజంగా అదృష్టవంతులు’’ అంటూ కామెంట్లు గుప్పించారు.

పాక్‌కు వెళ్లేది లేదు.. ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటున్న బీసీసీఐ!

కాగా.. 17 ఏళ్ల తర్వాత భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం దక్కడంలో ద్రవిడ్‌ చేసిన కృషి ఎంతో ఉంది. కోచ్‌గా వ్యవహరించిన ఆయన ఇటీవల రిటైర్‌ అయ్యారు. దీంతో బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించగా.. ద్రవిడ్‌ మాత్రం తన బోనస్‌ను సగానికి తగ్గించాలని కోరారని తెలుస్తోంది. ఇతర కోచ్‌లకు రూ. 2.5 కోట్లు అందించడమే అందుకు కారణం. వారితో పాటు తనని సమానంగా చూడాలని కోరినట్లు బీసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయనపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని