Anil Kumble: వేర్వేరుగా జట్లను తయారు చేసుకోవడం మంచిది: అనిల్ కుంబ్లే

పొట్టి కప్‌ ఫైనల్‌ పోరులో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌ టైటిల్‌ను సొంతం చేసుకొంది. మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ ఓ విషయం చెప్పాడు. ఇప్పుడు అదే ప్రధాన చర్చగా మారింది. తాజాగా అనిల్‌ కుంబ్లే, టామ్‌ మూడీ కూడా స్పందించారు. 

Published : 14 Nov 2022 18:17 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు.. ఐదు రోజులపాటు ఆడే టెస్టు ఫార్మాట్‌తోపాటు వన్డేలు (50 ఓవర్లు), టీ20లు (20 ఓవర్లు) ఉన్నాయి. ఇటీవల కాలంలో టీ20లు, టెస్టులకే అన్ని జట్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. వేర్వేరు జట్లను తయారు చేసుకొని మెగా టోర్నీలతోపాటు ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడిస్తున్నాయి. తాజాగా టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన ఇంగ్లాండ్‌ కూడా ఇదే ఫార్ములాతో విజయవంతమైంది. దీంతో టీమ్‌ఇండియా మాజీ సారథి అనిల్ కుంబ్లే కూడా మద్దతుగా నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు, టెస్టు ఫార్మాట్‌కు వేర్వేరుగా జట్లను సిద్ధం చేయాలని సూచించాడు. 

‘‘తప్పకుండా ప్రత్యేకంగా ఆయా ఫార్మాట్‌కు సంబంధించిన జట్టును తయారు చేయాలి. అలాగే కోచ్‌లను కూడా నియమిస్తే బెటర్. టీ20 స్పెషలిస్ట్‌లు ఉంటేనే ఉత్తమం. ఇదే ఇంగ్లాండ్‌ క్రికెట్ కార్యరూపంలోకి తీసుకొచ్చింది. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా కూడా ఇలా ప్రత్యేకంగా జట్లను తయారు చేసుకొంది. పెద్ద సంఖ్యలో ఆల్‌రౌండర్లను అన్వేషించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనా దృష్టిసారించాలి. పాక్‌పై మ్యాచ్‌నే ఉదాహరణగా తీసుకొంటే.. లియామ్‌ లివింగ్‌స్టోన్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇలా లియామ్‌ వంటి నాణ్యమైన ఆటగాడు ఏ ఇతర టీమ్‌కూ లోయర్‌ఆర్డర్‌లో ఆడేందుకు లేడు. అలాగే ఆసీస్‌ ప్లేయర్ స్టోయినిస్‌ కూడా ఆరో స్థానంలో బరిలోకి దిగాడు. ఇలాంటి జట్టును తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాని కోసం ఏం చేయాలనేది  ఆలోచించాలి’’ అనిల్ కుంబ్లే వెల్లడించాడు.

‘‘వేర్వేరు కెప్టెన్ లేదా వేర్వేరు కోచ్‌ అవసరం ఉందా..? అని అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేను. ఎలాంటి జట్టును ఎంపిక చేసుకోవాలి.. ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే విషయాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఆటగాడు, మేనేజ్‌మెంట్ మద్దతు ఉంటే మాత్రం ‘వేర్వేరు కోచ్‌లు’ అనే విషయంపై తీవ్రంగా ఆలోచించాలి. ఇంగ్లాండ్‌ను తీసుకొంటే తమ టెస్టు జట్టుతో పోలిస్తే వన్డేలు, టీ20ల స్క్వాడ్‌లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నాణ్యతతో కూడిన ఆటగాళ్లను జట్టు నిండా నింపేసింది. అయితే ఇదే అత్యుత్తమ జట్టు అని చెప్పడం తొందరపాటే అవుతుంది. గత ఏడాది కూడా టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ గెలవలేదు. ఒకవేళ అక్కడా గెలిచి వచ్చి ఉంటే వారి వాదనకు కాస్త బలం చేకూరేది. అందుకే భవిష్యత్తులోనూ గొప్ప ఫలితాలను సాధిస్తే మాత్రం అందరూ అంగీకరిస్తారు’’ అని మాజీ కోచ్‌ టామ్‌ మూడీ తెలిపాడు. అలాగే ఒకరే ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకోకుండా.. వన్డేలు-టీ20లకు, టెస్టులకే వేర్వేరుగా కోచ్‌ ఉండటం వల్లే తమ జట్టు అత్యుత్తమంగా రాణించిందని పాక్‌పై విజయం అనంతరం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ తెలిపాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని