Anil Kumble: భారత క్రికెట్‌లో ఈ రోజు ఓ సంచలనం‌.. కుంబ్లేకు పాక్‌ జట్టు దాసోహమైన వేళ!

భారత్‌ క్రికెట్‌ చరిత్రలో నేడు ఓ మరుపురాని రోజు. ఏ బౌలరైన కలలు కనే గణంకాలను భారత స్పిన్నర్‌ కుంబ్లే సాధించాడు.

Updated : 07 Feb 2023 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత(Team India) స్పిన్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే (Anil Kumble) స్పిన్‌ సుడిలో చిక్కుకొని పాక్‌ బ్యాటింగ్‌ పేకమేడలా కూలి నేటికి 24 ఏళ్లు. క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్‌ రికార్డును భారత లెజెండ్‌ సమం చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌(Team India) తొలిటెస్టులో ఓటమి చవి చూసింది. చెన్నైలో జరిగిన ఆ టెస్టులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ 136 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా 12 పరుగల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో 1999 ఫిబ్రవరి 7న నాటి ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగే రెండో టెస్టును గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న ఒత్తిడి భారత్‌పై పెరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 252 పరుగులు సాధించింది. ఎస్‌.రమేష్‌‌‌, అజారుద్దీన్‌లు మాత్రమే అర్ధ శతకాలు చేయగా.. ఐదుగురు బ్యాటర్లు కలిపి 8 పరుగులు చేశారు. సక్లైన్‌ ముస్తాక్‌ రెచ్చిపోయి 5 వికెట్లు సాధించాడు. దీంతో భారత బౌలర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. శ్రీనాథ్‌, వెంకటేష్‌ ప్రసాద్‌, హర్భజన్‌, కుంబ్లే(Anil Kumble)తో భారత బౌలింగ్‌ దళం పాక్‌ వెన్ను విరిచింది. దీంతో పాక్‌ 172కే ఆలౌట్‌ అయింది. కుంబ్లే 4, హర్భజన్‌ 3 వికెట్లు తీసుకొన్నారు. భారత్‌(Team India)కు 80 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మెరుగ్గా ఆడి 339 పరుగులు చేశారు. రమేష్‌ 96, గంగూలీ 62, శ్రీనాథ్‌ 49 పరుగులు చేశారు. కోట్ల వికెట్‌ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది. పాక్‌ ఎదుట 420 పరుగుల భారీ లక్ష్యం ఉంది. టెస్టుల్లో 400 పరుగులపై లక్ష్యాన్ని ఛేదించడం సామాన్యమైన విషయం కాదు. పాక్‌ ఓపెనర్లు అన్వర్‌, అఫ్రిదీ శుభారంభాన్ని ఇచ్చి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుంబ్లే (Anil Kumble) బౌలింగ్‌లో అఫ్రిదీ అవుట్‌ కావడంతో వికెట్ల పతనం మొదలైంది. కుంబ్లే(Anil Kumble) తర్వాతి బంతికే ఇజాజ్‌ అహ్మద్‌ ఎల్బీ రూపంలో డకౌట్‌ అయ్యాడు. స్టార్‌ బ్యాటర్లు ఇంజిమామ్‌ (6), మహమ్మద్‌ యూసఫ్‌ (0), మోయిన్‌ ఖాన్‌ (3)లను కూడా అతడు పెవిలియన్‌కు చేర్చడంతో పాక్‌ పతనం ఖాయమైంది. ఒంటరి పోరాటం చేస్తున్న అన్వర్‌ కూడా ఏకాగ్రత దెబ్బతిని కుంబ్లే బౌలింగ్‌లో లక్ష్మణ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సలీం మాలిక్‌-వసీం అక్రమ్‌ కొద్ది సేపు ప్రతిఘటించినా పాక్‌ ఓటమిని తప్పించలేకపోయారు. 186 పరుగల వద్ద కుంబ్లే(Anil Kumble) మరోసారి విజృంభించి మాలిక్‌ వికెట్‌ రూపంలో ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన ముస్తాక్‌ అహ్మద్‌, సక్లైన్‌  ముస్తాక్‌ను 58వ ఓవర్‌లో వరుసగా ఔటు చేశాడు. 60వ ఓవర్‌లో  వసీం అక్రమ్‌ను కుంబ్లే ఎల్బీగా బలిగొనడంతో పాక్‌ పతనం సంపూర్ణమైంది. ఈ ఇన్నింగ్స్‌లో 26.3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అనిల్‌ మొత్తం 74  పరుగులిచ్చి 10 వికెట్లు సాధించాడు. దీంతో ఇంగ్లాడ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ జిమ్‌లేకర్‌ 1956లో సృష్టించిన రికార్డును సమం చేసినట్లైంది.

టీ బ్రేక్‌ తర్వాత ఆలోచన..

‘‘ఈ మ్యాచ్‌లో లంచ్‌ నుంచి టీబ్రేక్‌ వరకు నేను వరుసగా బౌలింగ్‌ చేస్తునే ఉన్నాను. అప్పటికే నా ఖాతాలో ఆరు వికెట్లు పడ్డాయి. గతంలో నా 7 వికెట్ల బెస్ట్‌ను మెరుగుపర్చుకొనే అవకాశం ఈ మ్యాచ్‌లో ఉందన్న విషయాన్ని టీబ్రేక్‌లో గ్రహించాను. ఆ తర్వాత బౌలింగ్‌ను కొనసాగించాను. 7వ వికెట్‌ తీసిన కొద్దిసేపటికే వరుస బంతుల్లో 8,9 వికెట్లు కూడా దక్కాయి. పది వికెట్లు సాధించే అవకాశం ఉందని నాకు, జట్టు సభ్యులకు అప్పుడు అర్థమైంది’’ అని ఓ సందర్భంలో అనిల్‌ కుంబ్లే(Anil Kumble) స్వయంగా వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని