Swimmer: ఈత పోటీల్లో అనూహ్య పరిణామం.. స్పృహ కోల్పోయి కొలను అడుగుకు స్విమ్మర్‌

ఫినా వరల్డ్ అక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌(FINA World Aquatics Championships) పోటీల్లో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Published : 24 Jun 2022 01:28 IST

ఎలా రక్షించారంటే..?

బుడాపెస్ట్‌: ఫినా వరల్డ్ అక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌(FINA World Aquatics Championships) పోటీల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సోలో ఫ్రీ ఫైనల్‌లో పోటీపడుతూ ఒక స్విమ్మర్ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి, ఈత కొలను అడుగున పడిపోయింది. అక్కడే ఉన్న కోచ్‌ చాకచక్యంగా స్పందించడంతో ఆ స్విమ్మర్ ప్రాణాలతో బయటపడింది. హంగరీలోని బుడాపెస్ట్‌(Budapest)లో ఈ ఘటన జరిగింది. 

అమెరికా(US)కు చెందిన 25 ఏళ్ల అనితా అల్వారెజ్‌ ఆర్టిస్టిక్ స్విమ్మర్. ఈ ఛాంపియన్‌షిప్‌లో తన ప్రదర్శన పూర్తిచేసుకున్న ఆమె ఉన్నట్టుంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పట్టుకోల్పోవడంతో ఈత కొలను దిగువకు మునిగిపోసాగింది. అక్కడే ఉన్న ఆమె కోచ్‌ ఆండ్రియా ఫ్యూయెంటెస్‌ ఈ విషయాన్ని గుర్తించింది. ఏ మాత్రం ఆలస్యమైనా ఆమె ప్రాణాల మీదకు వస్తుందని గ్రహించి, వెంటనే కొలనులోకి దూకి, నీటి పైభాగానికి తీసుకువచ్చింది. అప్పటికీ అల్వారెజ్‌ స్పృహలోకి రాకపోవడంతో ఆమెను వెంటనే వైద్య సహాయం కోసం తరలించారు. ఇదంతా చూస్తున్న వీక్షకులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. 

దీనిపై ఆండ్రియా మాట్లాడుతూ.. ‘ఈ ఘటన చాలా భయపెట్టింది. నేను లైఫ్‌గార్డ్స్‌ను అప్రమత్తం చేసినప్పటికీ, వారికి నేను చెప్పేది అర్థం కాలేదు. దాంతో నేను కొలనులోకి దూకాల్సి వచ్చింది. ఆమె శ్వాస తీసుకోకపోవడం కనిపించి, చాలా ఆందోళనకు గురయ్యాను. అందుకే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నీటిలో దూకేశాను. తన ప్రదర్శన సమయంలో పడిన ఒత్తిడే ఈ పరిస్థితి కారణం కావొచ్చు. ప్రస్తుతం అల్వారెజ్ కోలుకుంది’ అంటూ ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ కోచ్ నాలుగుసార్లు ఒలింపిక్‌ పతక విజేత కావడం విశేషం.  

అల్వారెజ్ 2021లో యూఎస్‌ ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తాజాగా బుడాపెస్ట్‌లో జరిగిన పోటీల్లో ఆమె పతకాన్ని గెలుచుకోలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని