బ్రిస్బేన్‌ టెస్టు రద్దుకు ఇదీ ఓ కారణం కానుందా?

బ్రిస్బేన్‌ వేదికగా జరగాల్సిన భారత్×ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్‌ల్యాండ్‌ ఆరోగ్య మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు, హోటల్లో గదిలోనే ఉండాలనే కఠిన నిబంధనలు, బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్‌..........

Published : 10 Jan 2021 01:44 IST

ఇంటర్నెట్‌డెస్క్: బ్రిస్బేన్‌ వేదికగా జరగాల్సిన భారత్×ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్‌ల్యాండ్‌ ఆరోగ్య మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు, హోటల్లో గదిలోనే ఉండాలనే కఠిన నిబంధనలు, బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్‌ విధించడం వంటి కారణాలతో ఆఖరి టెస్టు జరుగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా రద్దుకు మరో కారణం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్వదేశంలో షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లాండ్‌ సిరీస్ నిర్వహించడం కోసం బీసీసీఐ ఆఖరి టెస్టు రద్దు చేసే యోచనలో ఉందని ఆ వార్తల సారాంశం.

కరోనా కొత్తరకం వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా యూకే నుంచి స్వదేశానికి వచ్చిన వారి విషయంలో కరోనా నెగెటివ్ అని తేలినా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే ప్రస్తుతం టీమిండియా ఉన్న సిడ్నీలో స్ట్రైయిన్‌ కేసులు లేవు. కానీ నాలుగో టెస్టు జరగనున్న బ్రిస్బేన్‌లో ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఆఖరి టెస్టు ముగిసేలోపు అక్కడ కొత్త కరోనా కేసులు పెరిగినా.. ఆ లోపు విదేశాల నుంచి వచ్చే వారిపై భారత్‌ ప్రభుత్వం కఠిన క్వారంటైన్‌ నిబంధనలు విధించినా టీమ్‌ఇండియాకు ఇబ్బందులు తప్పవు. దీంతో స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. అలా జరిగితే ఇంగ్లాండ్‌ సిరీస్‌పై ప్రభావం పడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రద్దుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

ఇదీ చదవండి

మూడు రనౌట్లా? అది కూడా టెస్టుల్లోనా!

నయావాల్‌..డీకోడెడ్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని