FIFA World: ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం.. బెల్జియంకు షాక్‌ ఇచ్చిన మొరాకో

ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ప్రపంచ రెండవ ర్యాంకర్‌ అయిన బెల్జియంను 22వ ర్యాంకర్‌ అయిన మొరాకో 2-0 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది.

Updated : 27 Nov 2022 23:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఇవాళ గ్రూప్‌-ఎఫ్‌లో బెల్జియం, మొరాకో మధ్య మ్యాచ్‌ జరిగింది. దీంట్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అయిన బెల్జియంను 22వ ర్యాంకర్‌ అయిన మొరాకో 2-0 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. రెండో అర్ధభాగంలో 73వ నిమిషంలో అబ్దెల్ హమీద్‌ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలిచి మొరాకోను ఆధిక్యంలోకి తీసుకెళ్లగా..  90వ నిమిషంలో జకారియా రెండో గోల్‌ చేసి మొరాకోకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఫిఫా ప్రపంచకప్‌లో 1998 తర్వాత మొరాకోకు ఇది తొలి విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో విజయం. ఈ విజయంతో గ్రూప్‌-ఎఫ్‌లో మొరాకో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. 

ఇక ఈ ప్రపంచకప్‌లో తొలి నుంచి సంచలనాలు నమోదు అవుతునే ఉన్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు పసికూనలపై ఓటమి చవిచూశాయి. ఈ నెల 22న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై సౌదీ అరేబియా గెలిచి షాక్‌ ఇచ్చింది. అర్జెంటీనా జట్టులో అగ్రశ్రేణి ఆటగాడు మెస్సీ ఉన్నప్పటికీ ఆ జట్టు 1-2 తేడాతో సౌదీ అరేబియాపై ఓడిపోయింది. ఇక మరో మ్యాచ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జపాన్‌ నాలుగు సార్లు ఫిఫా ప్రపంచకప్‌ను నెగ్గిన స్టార్‌ జట్టు జర్మనీని ఓడించింది. 1-2 తేడాతో ఈ మ్యాచ్‌లో జర్మనీ ఓటమి చవిచూసింది. ఇక బలమైన జట్లు గెలుస్తాయనుకొని బరిలోకి దిగినప్పటికీ చిన్నజట్లతో అతి కష్టంగా డ్రా చేసుకున్నాయి. వీటిలో అమెరికా-వేల్స్‌, మెక్సికో-పొలాండ్‌, ఉరుగ్వే-దక్షిణ కొరియా, నెదర్లాండ్‌-ఈక్వెడార్‌ జట్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని