Boxing: ప్రపంచ ఛాంపియన్‌గా ఉక్రెయిన్‌ హెవీవెయిట్‌ బాక్సర్‌

ఉక్రెయిన్‌కు చెందిన హెవీవెయిట్‌ బాక్సర్‌ ఒలెక్సాండర్‌ ఉసిక్‌ మరోసారి యూనిఫైడ్‌ హెవీవెయిట్‌ టైటిల్స్‌ను నిలబెట్టుకొన్నాడు. ఆదివారం జెడ్డాలో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన బాక్సర్‌ ఆంటోనీ జాషువాపై పూర్తి ఆదిపత్యం చలాయించాడు.

Published : 21 Aug 2022 13:16 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌కు చెందిన హెవీవెయిట్‌ బాక్సర్‌ ఒలెక్సాండర్‌ ఉసిక్‌ మరోసారి యూనిఫైడ్‌ హెవీవెయిట్‌ టైటిల్స్‌ను నిలబెట్టుకొన్నాడు. ఆదివారం జెడ్డాలో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన బాక్సర్‌ ఆంటోనీ జాషువాపై పూర్తి ఆదిపత్యం చలాయించాడు. మ్యాచ్‌ న్యాయనిర్ణేతల అభిప్రాయం ప్రకారం విజేతగా నిలిచాడు. ఇద్దరు జడ్జిలు ఉసిక్‌ పక్షాన నిర్ణయం ప్రకటించగా.. మరో జడ్జి మాత్రం జాషువా పక్షాన తీర్పును వెలువరించారు.  12 రౌండ్లపాటు జరిగిన ఈ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ ఫైట్‌లో విజయంతో ఉసిక్‌ డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీవో, ఐబీఎఫ్‌ వరల్డ్‌ హెవీ వెయిట్‌ టైటిల్స్‌ను నిలబెట్టుకొన్నాడు.

నాటకీయ పరిణామాలు..

ఈ మ్యాచ్‌ అనంతరం జాషువా ఆగ్రహం పట్టలేక ఉసిక్‌కు చెందిన రెండు టైటిల్‌ బెల్ట్‌లను రింగ్‌ బయట పడేయడం సంచలనం సృష్టించింది. కానీ, అనంతరం జాషువా రింగ్‌లో మాట్లాడుతూ ఉసిక్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. పరిస్థితులకు అనుగుణంగా ఉసిక్‌ అద్భుతంగా పోరాడాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉసిక్‌ను.. ఆట, కెరీర్‌, ఉక్రెయిన్‌ సంక్షోభంపై అడిగి తెలుసుకొన్నాడు.

మరోవైపు ఛాంపియన్‌ ఉసిక్‌ కూడా జాషువాను అభినందించాడు. ‘‘ఈ పోరాటం చరిత్రాత్మకం. నన్ను ఓడించడానికి ఎంత తీవ్రంగా యత్నించారో భవిష్యత్తు తరాలు చూస్తాయి. ఈ విజయం నాదేశానికి, నా బృందానికి, ఉక్రెయిన్‌ సైన్యానికి అంకితం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఉసిక్‌ ఇప్పటికే ఉక్రెయిన్‌ సైన్యంలో కూడా పనిచేశాడు. అప్పట్లో ఆటోమేటిక్‌ రైఫిల్‌ తీసుకొని కీవ్‌ వీధుల్లో పెట్రోలింగ్‌ చేసేవాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని