Anushka Sharma: అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులు

‘‘అనుష్క శర్మ: 88 బంతుల్లో 52 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్స్‌)’’. అదేంటీ.. బాలీవుడ్‌ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ క్రికెట్‌ ఆడారా..?

Updated : 03 Nov 2021 10:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘అనుష్క శర్మ: 88 బంతుల్లో 52 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్స్‌)’’. అదేంటీ.. బాలీవుడ్‌ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ క్రికెట్‌ ఆడారా..? అందులోనూ అర్ధశతకం చేసేశారా..?ఎక్కడ ఆడారు.. సినిమాలోనా.. నిజంగానా.. ఈ వార్త చూడగానే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు కదూ..! మీరే కాదండి.. బీసీసీఐ ఈ ట్వీట్‌ చేసినప్పటి నుంచి యావత్‌ క్రికెట్‌ ప్రియుల పరిస్థితి ఇదే. అయితే ఇందులో బీసీసీఐ పేర్కొన్న అనుష్క శర్మ.. విరాట్‌ కోహ్లీ సతీమణి కాదు. భారత మహిళల అండర్‌ 19 క్రికెటర్‌. అసలేం జరిగిందంటే..

మహిళల అండర్‌ 19 వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ 2021-22 టోర్నమెంట్‌ మంగళవారం ప్రారంభమైంది. ఇందులో దేశవాళీ మహిళా క్రికెటర్లను టీమ్‌ ఏ, బీ, సీ, డీ ఇలా నాలుగు జట్లుగా విభజిస్తారు. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్‌ రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది. ఇందులో ‘టీమ్‌ బి’ జట్టు కెప్టెన్‌ పేరు అనుష్క బ్రిజ్‌మోహన్‌ శర్మ. నిన్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ జరుగుతుండగా.. బీసీసీఐ విమెన్‌(bcci women) ట్విటర్‌ ఖాతాలో ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. అందులో ‘అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు’ అని రాసి ఉంది.

దీంతో ఈ ట్వీట్ కాస్తా నెటిజన్లను ఆశ్చర్యానికి, గందరగోళానికి గురిచేసింది. అనుష్క పేరు చూడగానే విరాట్ సతీమణి అనే అంతా అనుకున్నారు. అంతేనా.. కోహ్లీని విమర్శించేందుకు బీసీసీఐ ఇలా చేసిందేమో అని పొరబడ్డారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నెటిజన్లు కోహ్లీని ఉద్దేశిస్తూ ఫన్నీ పోస్టులు, మీమ్స్‌ పెడుతున్నారు. ‘‘అనుష్క మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లిందని ఎందుకు చెప్పలేదు. అక్కడ వామికా ఏడుస్తోంది’’ అని కోహ్లీ అంటున్నట్లుగా మీమ్స్‌ తయారుచేశారు.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ వరుస వైఫల్యాల నేపథ్యంలో అనుష్క శర్మపై నెట్టింట ట్రోలింగ్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కుటుంబానికి ఆన్‌లైన్‌లో బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో దిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని