IPL 2022 : ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌కు పోలికా..? రమీజ్‌ రజా అభిప్రాయం తప్పు: ఆకాశ్‌ చోప్రా

ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ విలువపై పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రజా వ్యాఖ్యలను..

Updated : 29 Oct 2023 11:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ విలువపై పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రజా వ్యాఖ్యలను టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, క్రీడా విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రా తప్పుపట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఐపీఎల్‌తో పాక్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)ను పోల్చడం సరికాదని పేర్కొన్నాడు. విలువ, వ్యూస్‌పరంగా పీఎస్‌ఎల్‌ మాత్రమే కాదు బిగ్‌బాష్ లీగ్‌ కూడా ఐపీఎల్‌ స్థాయికి చేరుకోవడం కష్టమని వ్యాఖ్యానించాడు. 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్‌ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ రూ. 16,375 కోట్లను సొంతం చేసుకుంది. ఇక 2023-2027 టర్మ్‌ కోసం రూ. 50 వేల కోట్ల వరకు కేటాయించేందుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది. 

‘‘ప్రసార హక్కుల కోసం వెచ్చించే సొమ్మును చూసుకుంటేనే ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు సరితూగే మరొక లీగ్‌ లేదు. ఇకపోతే ఆటగాళ్లను కొనుగోలు చేయడం, వారి కోసం ఒక్కో ఫ్రాంచైజీ వెచ్చించే నగదు, ఫ్రాంచైజీల విలువ వంటివన్నీ ఒకదానికొకటి లింక్‌. ఇవన్నీ వేర్వేరు కాదు. అందుకే ఐపీఎల్‌ విలువ చాలా ఎక్కువని చెబుతున్నా. ఒక వేళ మీరు (రమీజ్‌ రజా) పీఎస్‌ఎల్‌లోనూ వేలం నిర్వహిస్తే రూ.16 కోట్లతో ఆడే ఆటగాడిని చూడటం కష్టం. ఎప్పటికీ జరగదు కూడా’’ అని ఆకాశ్‌ చోప్రా వివరించాడు. ఒకవేళ ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌, బీబీఎల్‌, ది హండ్రెడ్‌, సీపీఎల్ (కరీబియన్‌ లీగ్‌)ను పోలిస్తే మాత్రం దానికంటే తప్పుడు అభిప్రాయం మరొకటి ఉండదని చోప్రా స్పష్టం చేశాడు. పది జట్లతో మార్చి 26 నుంచి ఐపీఎల్ - 15వ సీజన్‌ ప్రారంభం కానుంది. 

ఇంతకీ రమీజ్‌ రజా ఏమన్నాడు.. 

పీఎస్‌ఎల్‌ను 2016లో పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రారంభించింది. ఆరు జట్లు డ్రాఫ్ట్ మోడల్‌లో ఆటగాళ్లను ఎంచుకుని ధరను నిర్ణయించి ఒప్పందం చేసుకుంటాయి. అయితే ఐపీఎల్‌లో వేలంలోకి వెళ్లడం వల్ల ఫ్రాంచైజీల పోటీ నేపథ్యంలో భారీ ధరను అందుకుంటారు. దీనినే పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా ప్రస్తావిస్తూ.. ‘‘పీఎస్‌ఎల్‌లోని ఆటగాళ్లకు వేలం నిర్వహిస్తే ఐపీఎల్‌లో కంటే భారీ ధరను దక్కించుకుంటారు. అప్పుడు పీఎస్‌ఎల్‌ను కాదని ఎవరు ఐపీఎల్‌ ఆడతారు?’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని