IPL 2023 : దిల్లీ vs కోల్‌కతా మ్యాచ్‌లో టిమ్‌కుక్‌ సందడి.. అభిమానుల ‘ఐఫోన్‌’ కామెంట్లు..!

ఉత్కంఠభరితంగా సాగిన దిల్లీ, కోల్‌కతా(DC vs KKR) మ్యాచ్‌లో ఓ ప్రత్యేక అతిథి సందడి చేశారు. ఆయన్ని స్టేడియంలో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 21 Apr 2023 10:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ఐపీఎల్‌(IPL-2023)లో దిల్లీ(Delhi Capitals) ఎట్టకేలకు బోణీ కొట్టింది. కోల్‌కతా(kolkata knight riders)తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ఆపసోపాలు పడింది. ఐదు ఓటముల తర్వాత దిల్లీకి దక్కిన ఈ విజయం.. ఆ జట్టుతోపాటు అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. అయితే.. ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఓ స్పెషల్‌ గెస్ట్‌ స్టేడియంలో సందడి చేశారు. ఆయనే యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌(Tim Cook).

ముంబయి, దిల్లీల్లో యాపిల్‌ స్పెషల్‌ స్టోర్లు ప్రారంభించేందుకు టిమ్‌ కుక్‌ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌లను కలిశారు. ఈ క్రమంలోనే ఆయన దిల్లీ-కోల్‌కతా మ్యాచ్‌ను చూసేందుకు దిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానానికి వచ్చారు.  బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌తో కలిసి ఆయన మ్యాచ్‌ను వీక్షించారు. ఆయన స్టేడియంలో కనిపించగానే.. కెమెరాలన్నీ అటువైపే తిరిగాయి.

ఎంతో బిజీగా ఉండే యాపిల్‌ సీఈవో.. ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రావడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేసి.. సరదా వ్యాఖ్యలతో సోషల్‌మీడియాలో హోరెత్తించారు.‘టిమ్‌ భాయ్‌.. మా ఇంటికో ఐఫోన్‌ పంపండి’.. ‘ఐపీఎల్‌ అసలు మజాను చూడాలంటే.. ఆర్సీబీ vs సీఎస్కే మ్యాచ్‌ను ఆయన వీక్షించాల్సిందే’ అంటూ కామెంట్లు చేశారు.

ఉత్కంఠభరితంగా సాగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను దిల్లీ ఓడించింది. వార్నర్‌(57; 41 బంతుల్లో 11×4) కీలక ఇన్నింగ్స్‌తో జోరుగా కనిపించిన దిల్లీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరికి అక్షర్‌ పటేల్‌ (19 నాటౌట్‌; 22 బంతుల్లో 1×4) పోరాటం తోడవడంతో 128 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని