FIFA World cup 2022: అతడు అర్జెంటీనా ‘ఫైనల్‌’ వెపన్‌..!

కీలక టోర్నీల ఫైనల్స్‌ను గెలిపించేందుకు అర్జెంటీనా(Argentina) వద్ద ఓ కత్తిలాంటి ఆటగాడు ఉన్నాడు. మిగతా టోర్నీలో ఎలా ఆడినా.. ఫైనల్ వచ్చిందంటే రెచ్చిపోతాడు. కప్పు దక్కేదాకా పోరాడుతాడు. 

Updated : 20 Dec 2022 16:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

2022 ఫిఫా ప్రపంచకప్‌ను మెస్సి మాయ పూర్తిగా కమ్మేసింది. కానీ, మెస్సి విజయాల గురించి చెప్పాలంటే అందుకు సహకరించిన వ్యక్తి పేరును ప్రస్తావించాల్సిందే. మిస్టర్‌-10 జీవితంలో సాధించిన కీలక విజయాల్లో అతడి పాత్ర ఉంది. అసలు ఫైనల్స్‌ అంటే చాలు అతడు రెచ్చిపోయి ఆడతాడు. అతడిని అర్జెంటీనా(Argentina) ‘ఫైనల్‌’ ఆయుధం అంటే అతిశయోక్తి కాదు.  అర్జెంటీనా(Argentina) జట్టు ఆడిన 28 టోర్నమెంట్ల ఫైనల్స్‌లో అతడు.. మొత్తం 11 గోల్స్‌ కొట్టి.. రెండు గోల్స్‌కు అసిస్ట్‌ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, మెస్సి చరిష్మా ముందు అతడి కృషి స్పష్టంగా కనిపించలేదు.  అతడే వింగర్‌ ఏంజెల్‌ డి మారియా(angel di maria)..! 

తొలి సంపాదన 30 ఫుట్‌బాల్స్..!

డి మారియా (angel di maria) 1988 ఫిబ్రవరి 14న అర్జెంటీనా(Argentina)లోని రొసారియోలో డయానా-మిగ్యూల్‌ దంపతులకు జన్మించాడు. మూడేళ్ల వయస్సులో అతడు చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఓ డాక్టర్‌ డి మారియా(angel di maria)ను చూసి.. అతడికి ఏదైనా ఆటను నేర్పమని తల్లిదండ్రులకు సూచించాడు. దీంతో డి మారియా(angel di maria) కరాటేకు బదులు ఫుట్‌బాల్‌ను ఎంచుకొన్నాడు. అతడు చిన్నప్పుడు ఫుట్‌బాల్‌ నేర్చుకొంటూనే తల్లిదండ్రులతో కలిసి ఓ బొగ్గు యార్డ్‌లో పనిచేసేవాడు. అతడి ఫుట్‌బాల్‌ కోసం బూట్లు కొంటే.. అతడి సోదరీమణులు చెప్పుల్లేకుండానే పనికి వెళ్లేవారు. డి మారియా(angel di maria)కు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు స్థానిక రొసారియో క్లబ్‌ కోచ్‌లు అతడి ఆటను చూసి ముచ్చటపడ్డారు. 30 ఫుట్‌బాల్స్‌ ఇచ్చేలా ఒప్పందం చేసుకొని తమ జట్టులోకి తీసుకొన్నారు. 2007లో అండర్‌ 20 ప్రపంచకప్‌లో డి మారియా 3 గోల్స్‌ చేశాడు.  అదే ఏడాది పోర్చుగీస్‌లోని బెన్ఫికా క్లబ్‌లో చేరాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

* 2008లో అంతర్జాతీయ సీనియర్‌ జట్టులోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది  బీజింగ్‌ ఒలింపిక్స్ ఫైనల్స్‌లో నైజీరియాపై ఒక గోల్‌ చేశాడు. ఈ ఏకైక గోల్‌తో అర్జెంటీనా(Argentina)కు ఒలింపిక్స్‌ స్వర్ణం దక్కింది. 2021 కోపా అమెరికా కప్‌ ఫైనల్స్‌లో కూడా 22వ నిమిషంలో డిమారియా (angel di maria)చేసిన ఏకైక గోల్‌తో అర్జెంటీనా విజయం సాధించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఆ జట్టు గెలుచుకొన్న అతిపెద్ద టోర్నమెంట్‌ ఇదే. ఈ టోర్నమెంట్‌ విజయం మెస్సిలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచింది. 

* 2014 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో జర్మనీతో అర్జెంటీనా(Argentina) తలపడుతున్న సమయంలో డి మారియా గాయపడ్డాడు. పెయిన్‌ కిల్లర్‌ ఇంజెక్షన్లు తీసుకొని బరిలోకి దిగుతానని పట్టుబట్టగా.. అతడి క్లబ్ యాజమాన్యం అంగీకరించలేదు. తరచూ గాయాల బారిన పడటం డి మారియా (angel di maria)లోపంగా మారిపోయింది. 

* డి మారియా కెరీర్‌లో రియల్‌ మాడ్రిడ్‌, మాంఛెస్టర్‌ యునైటెడ్‌, పీఎస్‌జీ, జువెంటస్‌ వంటి ప్రతిష్ఠాత్మక క్లబ్‌లతో కలిసి పనిచేశాడు. 

రెండు గోల్స్‌లో అతడి పాత్ర..

గాయం నుంచి కోలుకొని ఈ ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన డి మారియా(angel di maria) తొలుత అద్భుతాలు ఏమీ చేయలేదు. డి మారియా కెరీర్‌లో కుడివైపు వింగర్‌గా ఎక్కువగా ఆడాడు. కానీ, 2014లో రియల్‌ మాడ్రిడ్‌ తరపున ఛాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌లో ఎడమవైపు ఆడి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కించుకొన్నాడు. దీంతో ఈ సారి అర్జెంటీనా (Argentina) కోచ్‌ స్కాలోని అతడిని ఫైనల్స్‌లో ఎడమవైపు వింగర్‌గా మోహరించాడు. అది ఫలితాన్నిచ్చింది.  ఫైనల్స్‌లో అర్జెంటీనా(Argentina)కు తొలి అర్ధభాగంలోనే ఆధిక్యాన్ని అందించాడు. జట్టుకు తొలి పెనాల్టీ అవకాశాన్ని డి మారియా(angel di maria)నే సృష్టించాడు. డంబెలెను తప్పించిన డి మారియా(angel di maria) బంతిని డ్రిబ్లింగ్‌ చేస్తూ ముందుకు వచ్చాడు. వెనకాలే వచ్చిన డంబెలె బంతిని అందుకునే ప్రయత్నంలో పెనాల్టీ ప్రదేశంలో డి మారియాను కిందపడేశాడు. దీంతో అర్జెంటీనాకు పెనాల్టీ అవకాశం దక్కింది. మెస్సి దీనిని సునాయాసంగా గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అలిస్టర్‌ నుంచి అందుకొన్న బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. అర్జెంటీనాకు 2-0 ఆధిక్యం వచ్చింది. ఆ తర్వాత గాయం కారణంగా అతడు మైదానం వీడాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత మెస్సి గురించి అందరూ చర్చించుకొంటున్నారు.. కానీ, ఫైనల్స్‌లో అర్జెంటీనాకు అత్యధిక గోల్స్‌ అవకాశాలను సృష్టించిన డి మారియా.. మెస్సి తళకుబెళుకుల ముందు కనిపించి కనిపించనట్లు ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు