Arjun Tendulkar: ఆ విషయంలో సచిన్‌ను అధిగమించిన అర్జున్‌

సచిన్‌(Sachin Tendulkar), అతడి తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌(Arjun Tendulkar) బౌలింగ్‌ గణాంకాల్లో ఓ పోలిక ఉంది. అంతే కాదు.. ఐపీఎల్‌లో సచిన్‌ చేయలేని పనిని అర్జున్‌ చేసి చూపించాడు.

Updated : 19 Apr 2023 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)తో మ్యాచ్‌ను సచిన్‌(Sachin Tendulkar) తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌(Arjun Tendulkar) ఎప్పటికీ మరిచిపోలేడు. ఎందుకంటే ఎంతో ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. ఐపీఎల్‌(IPL) కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించాడు ఈ యువ పేసర్‌. అర్జున్‌ వికెట్‌ సాధించిన సమయంలో ముంబయి(mumbai indians) డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే సచిన్‌ సంబరాలు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన తొలి వికెట్‌పై అర్జున్‌ స్పందించాడు.

దానిపైనే దృష్టిపెట్టాను..

‘ఐపీఎల్‌లో నా తొలి వికెట్‌ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయడంపై దృష్టి పెట్టాను. బంతిని కాస్త దూరంగా సంధించి.. లాంగ్‌ బౌండరీల కోసం ప్రయత్నించేలా బ్యాట్స్‌మెన్‌ను కవ్వించాలన్నది మా ప్రణాళిక. ఇక బౌలింగ్‌ వేయడాన్ని నేను ఎంతో ఆస్వాదిస్తాను. కెప్టెన్‌ ఏ సమయంలో బౌలింగ్‌ చేయమన్నా.. సిద్ధంగా ఉంటాను. జట్టు ప్రణాళికలకు కట్టబడి.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని అర్జున్‌ వివరించాడు.

క్రికెట్‌ గురించి తన తండ్రి సచిన్‌తో ఎప్పుడూ చర్చిస్తుంటానని అర్జున్‌ వెల్లడించాడు. ‘మేం క్రికెట్‌ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఆటకు ముందు వ్యూహాల గురించి చర్చించుకుంటాం. ప్రాక్టీస్‌లో ఏదైతే చేస్తావో.. ప్రతి మ్యాచ్‌లో అదే ఆటతీరును కొనసాగించాలని ఆయన సూచించారు. బంతి రిలీజ్‌పైనే నేను దృష్టి పెడతాను. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తాను’ అంటూ ఈ యువ పేసర్‌ పేర్కొన్నాడు.

సచిన్‌ vs అర్జున్‌..

ఇక అర్జున్‌ తీసిన తొలి వికెట్‌ అతడికి ఎంత గొప్పదో.. అతడి తండ్రి సచిన్‌ బౌలింగ్‌ గణాంకాలను పోల్చితే తెలుస్తుంది. ఎందుకంటే సచిన్‌ ఐపీఎల్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు మరి. 2009వ సీజన్‌లో సచిన్‌ ఆరు ఓవర్లు వేసినప్పటికీ.. ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. ఈ విషయంలో ఇప్పుడు సచిన్‌ను అతడి తనయుడు అధిగమించడం విశేషం. ఈ తండ్రీకుమారుల మధ్య మరో పోలిక ఉందండోయ్‌. 2009లో కోల్‌కతాపై ముంబయి తరఫున తొలిసారిగా బౌలింగ్‌ చేసిన సచిన్‌ మొదటి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చాడు. ఇటీవల అదే కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అర్జున్‌.. తొలి ఓవర్‌లో ఐదు పరుగులే ఇవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని