Ranji trophy: తండ్రి బాటలో తనయుడు.. రంజీ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్జున్‌ తెందూల్కర్‌ సెంచరీ

మాస్టర్‌ బ్లాస్టర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌(Arjun tendulkar) తండ్రి రికార్డును సమం చేశాడు. 1988 నాటి మ్యాచ్‌ను గుర్తుచేస్తూ తొలి శతకాన్ని అందుకున్నాడు. 

Published : 14 Dec 2022 17:25 IST

పనాజీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ (arjun tendulkar) తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంజీ ట్రోఫీ(Ranji trophy)లో భాగంగా బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్‌ నైట్‌ వాచ్‌మెన్‌గా బ్యాటింగ్‌కు దిగి శతకం బాదేశాడు. దీంతో గోవా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. గతంలో సచిన్‌ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. 1988 రంజీ ట్రోఫీలోకి కేవలం 15 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్‌(Sachin tendulkar) మొదటి సెంచరీని నమోదు చేశాడు. 

నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి..

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్‌ 15 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. రెండో రోజు మాత్రం తన సత్తా ఏమిటో చూపుతూ విజృంభించాడు. 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 120 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మరో బ్యాటర్ సుయాంశ్‌ ప్రభుదేశాయ్‌ (212*)తో కలిసి అర్జున్‌  గోవా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 221 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో గోవా జట్టు రెండో రోజు ఆట ముగిసేసమయానికి 493/8 భారీ స్కోరు చేసింది.

ముంబయి నుంచి గోవాకి..

2018 శ్రీలంక పర్యటనలో భాగంగా అండర్-19 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అర్జున్‌.. ప్రపంచకప్‌ జట్టులో మాత్రం ఆడలేకపోయాడు. భారత టీ20 లీగ్‌లో ముంబయి ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన తర్వాత ఒక్క మ్యాచ్‌లో సైతం ఆడలేకపోయాడు. ఈ విషయంపై హెడ్‌ కోచ్‌ మహేల జయవర్దనె స్పందిస్తూ ఆటపరంగా అతడింకా కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఇటీవల ఆ జట్టు నుంచి ఎన్‌వోసీ పొంది ప్రస్తుతం గోవా జట్టులోకి మారిపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని