Arjun Tendulkar: ముంబయి తరఫున సచిన్‌ తనయుడు అర్జున్‌ అరంగేట్రం

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ (Arjun Tendulkar) తొలిసారి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. ముంబయి తరఫున అరంగేట్రం చేశాడు.

Updated : 16 Apr 2023 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) సొంత మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders)ను ఎదుర్కొంటోంది. ముంబయి తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అనంతరం దిల్లీపై గెలిచి ఉత్సాహం మీద ఉండగా.. కోల్‌కతా గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇంకో విశేషం ఏంటంటే.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ (Arjun Tendulkar) ముంబయి జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 17 పరుగులు ఇచ్చాడు.

ముంబయి జట్టుకు సచిన్‌ అద్భుతమైన విజయాలు అందించగా.. ఇప్పుడు కుమారుడు ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. అర్జున్‌ను రెండేళ్ల క్రితమే ముంబయి వేలంలో దక్కించుకుంది. అయితే.. ఇప్పటివరకూ ఆడే అవకాశం రాలేదు. ఇదే అతడికి తొలి మ్యాచ్‌. ఇక ఆల్‌రౌండరైన అర్జున్‌ దేశవాళీ క్రికెట్‌లో గోవా తరఫున ఆడాడు. ఇప్పటివరకూ ఏడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, ఏడు లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు, తొమ్మిది టీ20లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ (Rohit Sharma) అందుబాటులో లేకపోవడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) సారథ్య బాధ్యతలు చెపట్టాడు. టాస్‌ గెలిచిన సూర్య.. బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి..

తండ్రి, తనయుడు ఇలా ఒకే జట్టు తరఫున ఆడటం.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో అరంగేట్రంపై పలువురు అర్జున్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి. సచిన్‌ ముంబయి జట్టుకు ఆడిన పదేళ్ల అనంతరం ఇప్పుడు కుమారుడు అర్జున్‌ తొలి మ్యాచ్‌ ఆడుతున్నాడు. గుడ్‌ లక్‌ అర్జున్‌’ అంటూ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని