MI vs PBKS: ముంబయి - పంజాబ్‌ చెరో సగం.. అర్ష్‌దీప్‌ ఖాతాలో 50+ వికెట్లు

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్‌ మీద ఉన్న ముంబయికి పంజాబ్ షాక్‌ ఇచ్చింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసి పంజాబ్ విజయం సాధించింది.

Published : 23 Apr 2023 11:45 IST

ఇంటర్నెట్ డెస్క్: వాంఖడే స్టేడియంలో ముంబయిపై పంజాబ్‌ (MI vs PBKS) అద్భుత విజయం సాధించింది. భారీ స్కోరును ఛేదించే క్రమంలో ముంబయి చివరి వరకు పోరాడినా.. ఓటమి మాత్రం తప్పలేదు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ కేవలం రెండు పరుగులను మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి ముంబయిని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. తిలక్‌ వర్మ (3), నెహాల్‌ వధెరా (0)ను వరుస బంతుల్లో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. రెండుసార్లూ స్టంప్‌ విరిగిపోవడం గమనార్హం. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును హాఫ్ సెంచరీ సాధించిన పంజాబ్ కెప్టెన్‌ సామ్‌ కరన్ సొంతం చేసుకున్నాడు. 

మరిన్ని విశేషాలు

* ముంబయిపై పంజాబ్‌కు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు 2017లో వాంఖడే స్టేడియం వేదికగానే 230/3 స్కోరును పంజాబ్ సాధించింది. 

* సామ్ కరన్ - హర్‌ప్రీత్ భాటియా ఐదో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. పంజాబ్‌ తరఫున ఈ వికెట్‌కు రెండో  అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. 2013లో డేవిడ్ మిల్లర్ - రాజ్‌గోపాల్ సతీష్ కలిసి 130 పరుగులను జోడించారు. 

* చివరి ఆరు ఓవర్లలో భారీగా పరుగులు సాధించిన రెండో జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ముంబయిపై 109 పరుగులను దంచేసింది. అంతకుముందు 2016లో గుజరాత్‌ లయన్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు 126 పరుగులను సాధించింది. 

* కనీసం 25 పరుగులు చేసిన సమయంలో.. బ్యాటర్‌ అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన పంజాబ్‌ ఆటగాడిగా జితేశ్ శర్మ టాప్‌లో నిలిచాడు. ముంబయిపై కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు రాబట్టాడు. దీంతో అతడి స్ట్రైక్‌రేట్‌ 357.14తో ఉంది. గతేడాది కోల్‌కతాపై భానుక రాజపక్స (9 బంతుల్లో 31) 344.44 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు.

* ముంబయి - పంజాబ్ జట్లు ఇప్పటి వరకు 30 మ్యాచుల్లో తలపడగా.. చెరో 15 మ్యాచుల్లో విజయం సాధించాయి. వాంఖడేలో 10 జరగగా.. చెరో ఐదు మ్యాచుల్లో నెగ్గాయి. మొహాలీలో 8 జరగగా.. చెరో నాలుగేసి మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. 

* ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున 50 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌ అవతరించాడు. ముంబయిపై నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్‌లో అతడి మొత్తం వికెట్ల సంఖ్య 53కి చేరాయి.  పీయూశ్‌ చావ్లా (84), సందీప్‌ శర్మ (73), అక్షర్ పటేల్ (61), షమీ (58) ఈ జాబితాలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని