arshdeep singh: ఒత్తిడిలోనూ రాణించగల సత్తా అతడిది: టీమ్‌ఇండియా కోచ్‌

భారత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ టీమ్‌ఇండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.

Published : 29 Sep 2022 01:21 IST

దిల్లీ: ఆసియా సూపర్‌ 4లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ వదిలేసిన కారణంగా భారత బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆటలో ఇటువంటి పొరపాట్లు సహజమేనంటూ ఆ సమయంలో టీమ్‌ఇండియా జట్టు అతడి పక్షాన నిలిచింది. తాజాగా భారత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ ఈ యువ ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు. ఆటలో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడగల సత్తా అతడికి ఉందని తెలిపాడు. కెప్టెన్లు సైతం అతని పురోగతిపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. 

‘‘గత భారత టీ20 లీగ్‌లో మ్యాచులు పరిశీలిస్తే అర్ష్‌దీప్‌ అద్భుతంగా ఆడాడు. డెత్‌ ఓవర్లలో అతడు బాగా బౌలింగ్‌ చేయగలడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ రాణిస్తున్నాడు. ఎంత ఒత్తిడి ఉన్నా, ఆట క్లిష్టతరంగా మారుతున్నా ప్రశాంతంగా ఆడగలడు. అతడి ఆటతీరుతో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ దశలో ఆటగాళ్లకు ప్రత్యేకించి మేము ఎలాంటి సూచనలు చేయడం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఒక శైలి ఉంటుంది. వారి ప్రణాళికలు నిర్దేశించుకోవడంలో మేం వారికి మద్దతుగా నిలుస్తామంతే. తమలోని సామర్థ్యాలను మెరుగుపరుచుకునేలా వారితో చర్చిస్తుంటాం’’ అని తెలిపాడు. 
ఇప్పటివరకు 11 టీ20ల్లో 14 వికెట్లు తీసిన ఈ పేసర్‌ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని