Published : 11 Jun 2021 13:25 IST

Rahul Dravid: ఆ బాధ నేనూ అనుభవించా

అందుకే భారత్ ఏలో అందరికీ చోటిచ్చా: రాహుల్‌ ద్రవిడ్‌

దిల్లీ: భారత్‌-ఏ కోచ్‌గా జట్టులో అందరికీ అవకాశం ఇచ్చేవాడినని ఎన్‌సీయే చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. సిరీసుకు ఎంపికై ఒక్క మ్యాచైనా ఆడకుంటే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసన్నారు. చిన్నప్పుడు తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. శ్రీలంకలో పర్యటించే భారత యువ జట్టుకు ఆయన కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

‘అందరికీ అవకాశం ఇస్తానని నేను ముందే చెప్పేవాడిని. నేను కోచ్‌గా ఉన్నప్పుడు భారత్‌-ఏకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ చోటిచ్చేవాడిని. మ్యాచుల్లో అవకాశం దొరక్కపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు అనుభవం ఉంది. టీమ్‌ఇండియా-ఏకు ఎంపికై ఒక్క మ్యాచన్నా ఆడకపోవడం చెప్పలేనంత బాధాకరం’ అని ద్రవిడ్‌ అన్నారు. ప్రస్తుతం ఆయన భవిష్యత్తు భారత క్రికెటర్లకు తర్ఫీదునిస్తుండటం విశేషం.

‘ఓ టోర్నీలో మీరు 700-800 పరుగులు చేశారు. భారత్-ఏకు ఎంపికయ్యారు. కానీ నిరూపించుకోవడానికి మీకు అవకాశం రాలేదు. అప్పుడు సెలక్టర్ల దృష్టిలో మీరు వెనకబడతారు. తర్వాతి సీజన్లోనైనా 800 పరుగులు చేద్దామని భావిస్తారు. కానీ అదంత సులభం కాదు. అవకాశం కచ్చితంగా దొరుకుతుందన్న ధీమా లేదు. అందుకే నేను  11 మంది కాకుండా అత్యుత్తమ 15 మంది ఆడతారని చెబుతా. అండర్‌-19లో వీలైతే ప్రతి మ్యాచ్‌కు ఐదారు మార్పులు సాధ్యమే’ అని ద్రవిడ్‌ వివరించారు.

ఒకప్పుడు భారత క్రికెటర్లకు సరైనా ఫిట్‌నెస్‌ సహాయకులు, సౌకర్యాలు ఉండేవి కావని రాహుల్‌ అన్నారు. అందుకు సంబంధించిన విజ్ఞానం కొరత ఉండేదన్నారు. రిజర్వు బెంచీపై ఉంటే, రోడ్డు పక్కన ఆడితే సరైన క్రికెటర్‌ కాలేరన్నారు. ఆటను ప్రేమిస్తేనే సాధ్యమని, అలాంటి చాలామంది క్రికెటర్లు ఇప్పుడు మనకున్నారని వెల్లడించారు. ఆటగాళ్లకు సరైన పిచ్‌లు, కోచింగ్‌ ఇవ్వడం, ఫిట్‌నెస్‌ సహాయకులను ఏర్పాటు చేయడం అవసరమన్నారు.

‘1990, 2000ల్లో ఇలాంటి వసతులు లేవు. దేహదారుఢ్యానికి సంబంధించిన సమాచారం, విజ్ఞానం కొరత ఉండేది. మేం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫిట్‌నెస్‌ ట్రైనర్లను చూసేవాళ్లం. కానీ వారినుంచి మాకు ఎక్కువ సమాచారం దొరకేది కాదు. అతిగా జిమ్‌ చేయకండి. దేహం మొద్దు బారుతుందని చెప్పేవాళ్లు. పదేపదే బౌలింగ్‌ చేయండి. విరామం తీసుకుంటూ పరుగెత్తండి అనేవాళ్లు’ అని ద్రవిడ్‌ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని