Ashes Test Series: పోరాడుతున్న ఇంగ్లాండ్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఎట్టకేలకు ఇంగ్లాండ్‌ పుంజుకుంది. వరుసగా రెండ్రోజులు తడబడిన ఇంగ్లాండ్‌ శుక్రవారం గాడినపడింది. డేవిడ్‌ మలన్‌ (80 బ్యాటింగ్‌; 177 బంతుల్లో 10×4), కెప్టెన్‌ జో రూట్‌ (86 బ్యాటింగ్‌; 158 బంతుల్లో 10×4) పట్టుదలగా ఆడుతుండటంతో ఇంగ్లాండ్‌ గట్టిగా పోరాడుతోంది.

Updated : 11 Dec 2021 08:45 IST

సెంచరీల దిశగా మలన్‌, రూట్‌
ప్రస్తుతం 220/2.. మరో 58 పరుగులు వెనకే
బ్రిస్బేన్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఎట్టకేలకు ఇంగ్లాండ్‌ పుంజుకుంది. వరుసగా రెండ్రోజులు తడబడిన ఇంగ్లాండ్‌ శుక్రవారం గాడినపడింది. డేవిడ్‌ మలన్‌ (80 బ్యాటింగ్‌; 177 బంతుల్లో 10×4), కెప్టెన్‌ జో రూట్‌ (86 బ్యాటింగ్‌; 158 బంతుల్లో 10×4) పట్టుదలగా ఆడుతుండటంతో ఇంగ్లాండ్‌ గట్టిగా పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 2 వికెట్లకు 220 పరుగులు సాధించింది. మరో రెండ్రోజుల ఆట మిగిలివున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు ఇంకా ఓటమి ముప్పు తప్పలేదు. ఆ జట్టు ఇప్పటికీ 58 పరుగులు వెనుకబడే ఉంది. శనివారం మొదటి సెషన్‌ ఆట కీలకం కానుంది. ఉదయం పూట ఆసీస్‌ పేసర్లు ప్రభావం చూపితే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఒకవేళ మలన్‌, రూట్‌లు మూడో రోజు స్ఫూర్తినే కొనసాగిస్తే ఇంగ్లాండ్‌ డ్రాతో గట్టెక్కినట్లే! అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 343/7తో ఆట కొనసాగించిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 104.3 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు హెడ్‌ (152; 148 బంతుల్లో 14×4, 4×6), మిచెల్‌ స్టార్క్‌ (35; 64 బంతుల్లో 5×4)లు ఎనిమిదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్‌పై ఆసీస్‌కు 278 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో దీటుగా స్పందిస్తుందని ఎవరూ ఊహించలేదు. 278 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండ్‌కు ఇన్నింగ్స్‌ ఓటమి ఖాయమేనని అనిపించింది. అందుకు తగ్గట్లే ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లోనే ఇంగ్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ (1/43) బౌలింగ్‌లో ఓపెనర్‌ బర్న్స్‌ (13).. వికెట్‌ కీపర్‌ కేరీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కొద్దిసేపటికే మరో ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (27)ను స్కార్క్‌ (1/60) వెనక్కి పంపాడు. 61 పరుగులకే ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్‌ పతనం ఖాయమే అనుకున్న సమయంలో మలన్‌, రూట్‌ గొప్ప సంయమనం ప్రదర్శించారు. అత్యుత్తమ బ్యాటింగ్‌ నైపుణ్యంతో క్రీజులో పాతుకుపోయారు. 49 ఓవర్ల పాటు ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మూడో వికెట్‌కు అజేయంగా 159 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఒక క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక పరుగులు రాబట్టిన ఇంగ్లాండ్‌ టెస్టు ఆటగాడిగా రూట్‌ (1541) ఘనత అందుకున్నాడు. 2002లో మైకెల్‌ వాన్‌ (1481) పేరిట నమోదైన రికార్డును తిరగరాశాడు. టెస్టుల్లో ఒక క్యాలెండర్‌ సంవత్సరం (2006)లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మహ్మద్‌ యూసుఫ్‌ (1788- పాకిస్థాన్‌) పేరిట ఉంది. ఇక శనివారం తొలి సెషన్‌ ఇంగ్లాండ్‌కు కీలకం. ఉదయం తేమ పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసీస్‌ భావిస్తుందనడంలో సందేహం లేదు. 10 ఓవర్ల తర్వాత కొత్త బంతి కూడా ఆసీస్‌కు అందుబాటులోకి వస్తుంది. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మలన్‌, రూట్‌లు మొదటి సెషన్‌ పూర్తిగా బ్యాటింగ్‌ చేయడం అత్యంత ముఖ్యం.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 147

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 425

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: హమీద్‌ (సి) కేరీ (బి) స్టార్క్‌ 27; బర్న్స్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 13; మలన్‌ బ్యాటింగ్‌ 80; రూట్‌ బ్యాటింగ్‌ 86; ఎక్స్‌ట్రాలు 14;

మొత్తం: (70 ఓవర్లలో 2 వికెట్లకు) 220;

వికెట్ల పతనం: 1-23, 2-61; బౌలింగ్‌: స్టార్క్‌ 14-2-60-1; హేజిల్‌వుడ్‌ 8-4-13-0; కమిన్స్‌ 14-4-43-1; లయన్‌ 24-4-69-0; గ్రీన్‌ 7-2-12-0; లబుషేన్‌ 3-0-14-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని