Ashes Test Series: రెండో టెస్టు కూడా కంగారూలదే

యాషెస్‌ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్‌పై.. ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-0..

Published : 20 Dec 2021 16:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యాషెస్‌ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై.. ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో కూడా ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

82/4 ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ బాగానే పోరాడింది. అయితే, ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో.. ఇంగ్లాండ్‌ డ్రా కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఇంగ్లాండ్ బ్యాటర్‌ జోస్ బట్లర్‌ (26: 207 బంతుల్లో 2x4) ఆసీస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతున్న క్రమంలో రిచర్డ్‌సన్‌ వేసిన 110వ ఓవర్‌ ఆఖరు బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 192 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో జై రిచర్డ్‌సన్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లైయన్‌ తలో రెండు, మైఖేల్‌ నేసర్‌ ఒక వికెట్‌ తీశారు.

అంతకు ముందు, 230/9 స్కోరు వద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం 468 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌ మెరుగ్గా రాణించింది. 473/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ను 236 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్ చేసింది.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని