ఇంటికి చేరుకున్న అశ్విన్‌, సుందర్‌

టీమ్‌ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్ సుందర్‌ శుక్రవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. ఐపీఎల్‌ తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిన వీరు అక్కడ..

Published : 22 Jan 2021 14:49 IST

చెన్నై: టీమ్‌ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్ సుందర్‌ శుక్రవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. ఐపీఎల్‌ తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిన వీరు అక్కడ టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించారు. మూడు టెస్టుల్లో 12 వికెట్లు తీసిన సీనియర్‌ స్పిన్నర్‌.. సిడ్నీ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. హనుమ విహారి (21*)తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యం జోడించిన అశ్విన్‌(39*) చివరి వరకూ క్రీజులో పాతుకుపోయాడు. భరించలేని వెన్ను నొప్పితో సతమతమౌతున్నా పట్టుదలగా బ్యాటింగ్‌ చేశాడు. దాంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసి భారత్‌ ఓటమి నుంచి తప్పించుకుంది.  

ఇక చివరిదైన గబ్బా టెస్టులో అరంగేట్రం చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఆధిక్యం 33 పరుగులకు తగ్గించడంలో కీలకంగా వ్యవహరించాడు. శార్దూల్‌ ఠాకుర్‌ (66)తో కలిసి సుందర్‌ (62) ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. దాంతో టీమ్‌ఇండియా నాలుగో టెస్టులో మళ్లీ పోటీలోకి వచ్చింది. లేదంటే మ్యాచ్‌ చేజారిపోయేది. ఈ క్రమంలోనే భారత జట్టుతో కలిసి గురువారం ఉదయం దుబాయ్‌కు చేరుకున్న అశ్విన్‌, సుందర్‌ నేరుగా చెన్నైకి రాలేకపోయారు. దుబాయ్‌లో వేచి చూసి శుక్రవారం ఉదయం తమ స్వస్థలాలకు చేరుకున్నారు. 

కొత్తరకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అశ్విన్‌, సుందర్‌ మరో ఆరు రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాతే బయటకు వెళ్లాలి. ఇక ఆస్ట్రేలియాపై రాణించిన ఈ ఇద్దరు స్పిన్నర్లు.. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే 4 టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపికయ్యారు. మరోవైపు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, అజింక్య రహానె, రోహిత్‌, శార్దూల్‌ ఠాకుర్‌, పృథ్వీషా గురువారం ముంబయి చేరుకోగా.. రిషభ్‌ పంత్‌ దిల్లీ, నటరాజన్‌ బెంగళూరు, సిరాజ్‌ హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో దిగారు. వారంతా అక్కడి నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. 

ఇవీ చదవండి..
ఆటగాళ్లకు క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపు
ఇండియా అంటే ఇది: సెహ్వాగ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని