Covid: నిద్రలేని రాత్రులు గడిపిన అశ్విన్‌

కుటుంబ సభ్యులకు కొవిడ్‌ సోకడంతో పది రోజుల పాటు నిద్రపోలేదని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ అన్నాడు. ఒత్తిడి ఎక్కువ అవ్వడం, విశ్రాంతి లేకపోవడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను...

Published : 28 May 2021 12:31 IST

చెన్నై: కుటుంబ సభ్యులకు కొవిడ్‌ సోకడంతో పది రోజుల పాటు నిద్రపోలేదని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ అన్నాడు. ఒత్తిడి ఎక్కువ అవ్వడం, విశ్రాంతి లేకపోవడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను వదిలేసి వెళ్లానని తెలిపాడు. తనవాళ్లు కోలుకోవడంతో తిరిగి లీగులో పునరాగమనం చేయాలని భావించినా వాయిదా పడిందని వెల్లడించాడు.

ఐపీఎల్‌లో అశ్విన్‌ దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. కొన్ని మ్యాచులు ముగిశాక అతడు తిరిగి చెన్నై వెళ్లిపోయాడు. పిల్లలు, వృద్ధులు సహా తన కుటుంబంలో పది మందికి పైగా కరోనా బారిన పడటమే కారణం. అందులో కొందరి పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

‘మా ప్రాంతంలో దాదాపుగా అందరూ కొవిడ్‌ బారిన పడ్డారు. మా బంధువుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. ఎలాగోలా కోలుకున్నారు. దాదాపు పది రోజుల వరకు నేను నిద్రపోలేదు. దాంతో నాపై ఒత్తిడి పెరిగిపోయింది. అసలు నిద్రలేకుండానే నేను మ్యాచులు ఆడాను. నాపై భారం ఎక్కువ అవ్వడంతో ఐపీఎల్‌ వదిలేసి ఇంటికి వెళ్లిపోయాను’ అని యాష్‌ అన్నాడు.

‘నేను ఐపీఎల్‌ వదిలి ఇంటికి వచ్చేటప్పుడు మళ్లీ లీగు ఆడగలనా అనిపించింది. కానీ ఆ సమయానికి అవసరమైన పనే చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు క్రికెట్‌ ఉండదని అనుకున్నా. కుటుంబ సభ్యులు కోలుకోవడంతో ఐపీఎల్‌లో పునరాగమనం చేయాలనుకున్నా. ఇంతలోనే లీగ్‌ వాయిదా పడింది’ అని యాష్‌ తెలిపాడు. ప్రస్తుతం అతడు టీమ్‌ఇండియాతో కలిసి ముంబయిలో 14 రోజుల క్వారంటైన్లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు