IND vs AUS: టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ చరిత్ర సృష్టిస్తాడు: దాదా

బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్‌ ఉన్నప్పటికీ వికెట్లు తీయడంలో రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) ముందుంటాడు. తాజాగా ఆసీస్‌తో నాలుగో టెస్టులోనూ (IND vs AUS) కీలకమైన ఆరు వికెట్లు తీసి అదరహో అనిపించాడు.

Published : 11 Mar 2023 11:31 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో భారత టాప్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) రికార్డుల మీద రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా నాలుగో టెస్టులో (IND vs AUS) ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్‌ (113).. బోర్డర్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.  నాథన్‌ లయన్‌ 26 టెస్టుల్లో 113 వికెట్లు తీయగా.. అశ్విన్‌ కేవలం 22 టెస్టుల్లోనే పడగొట్టాడు. ఈ క్రమంలో అశ్విన్‌ ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ చరిత్ర సృష్టిస్తాడని వ్యాఖ్యానించాడు. 

‘‘అహ్మదాబాద్‌లాంటి పిచ్‌ మీద అశ్విన్‌ వికెట్లు తీయడం అద్భుతం. అతడి బౌలింగ్‌ క్లాస్‌గా ఉంటుంది. టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ చరిత్ర సృష్టిస్తాడని నాకు అనిపిస్తోంది. తప్పకుండా ఈ సిరీస్‌లో ఇదొక మంచి టెస్టు మ్యాచ్‌ అవుతుందని భావిస్తున్నా. ఇప్పటిదాకా కఠినమైన పిచ్‌లపై బ్యాటింగ్‌ చేసిన భారత బ్యాటర్లకు మంచి అవకాశం వచ్చినట్లే’’అని గంగూలీ తెలిపాడు. స్వదేశంలో 26 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లేను అధిగమించాడు. అశ్విన్‌ కెరీర్‌లో మొత్తం 32 సార్లు 5 వికెట్లు ప్రదర్శన చేయడం విశేషం. ఇప్పటి వరకు అశ్విన్‌ ఖాతాలో 473 వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్టులో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ ఆడుతోంది. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని