Ashwin: అశ్విన్‌ మ్యాచ్ విన్నర్‌.. ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోవాలి: రణతుంగ

సెప్టెంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కింది.  వన్డే జట్టులోకి అశ్విన్‌ రీ ఎంట్రీపై  శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ (Arjuna Ranatunga) స్పందించాడు. 

Published : 19 Sep 2023 16:10 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా సీనియర్ ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin)కు ఏడాదిన్నర అనంతరం వన్డే జట్టులో చోటుదక్కింది. సెప్టెంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో రాణిస్తే అశ్విన్‌ను ప్రపంచకప్ జట్టులోకి కూడా తీసుకునే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అశ్విన్ తిరిగి వన్డే జట్టులోకి రావడంపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ (Arjuna Ranatunga) స్పందించాడు. అశ్విన్‌ను మ్యాచ్‌ విన్నర్‌గా అభివర్ణిస్తూ అతడిని ప్రపంచకప్‌ జట్టు (World Cup 2023)లోకి తీసుకోవాలని సూచించాడు. 

పాస్‌పోర్ట్‌ మరిచిన రోహిత్‌.. వైరల్‌గా మారిన కోహ్లీ ఒకప్పటి కామెంట్లు!

‘‘వన్డే ప్రపంచ కప్‌ స్వదేశంలో జరగడం భారత్‌కు బాగా కలిసొస్తుంది. అయితే, సొంత అభిమానుల ముందు ఆడటం వారికి అతిపెద్ద ప్రతికూలతే అని చెప్పొచ్చు. ఎందుకంటే అభిమానుల నుంచి భారత జట్టుపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని టీమ్‌ఇండియా అధిగమించాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయాలంటే తుది జట్టులో కచ్చితంగా ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ ఉండాలి. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్ వంటి ఆల్‌రౌండర్ల వైపు మొగ్గుచూపుతోంది. నా వరకైతే రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో లేకపోయినా జట్టులో ఉండాలి. అతడు ఆడిన మ్యాచ్‌ల్లో మీకు మ్యాచ్‌ విన్నర్‌ అవ్వొచ్చు. అశ్విన్‌ మైదానంలో కాస్త నెమ్మదిగా ఉన్నా, పాత తరం మనిషిలా కనిపించినా ఉప ఖండ పిచ్‌లపై వికెట్లు పడగొట్టగలిగే బౌలర్లు కావాలి. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ కచ్చితంగా వేరే ఆలోచన ఉండొచ్చు. కానీ, నేనైతే అశ్విన్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలనుకుంటా. ఎందుకంటే ఆఫ్‌ స్పిన్నర్ లేకుండా బౌలింగ్ ఎటాక్‌ అసంపూర్ణంగా ఉంటుంది’’ అని రణతుంగ వివరించాడు. 

ప్రపంచకప్‌నకు ఎంపికైన అక్షర్ పటేల్‌కు ఆసియా కప్‌ ఫైనల్‌లో రెండు, మూడు గాయాలయ్యాయి. దీంతో ఆసీస్‌తో మొదటి రెండు వన్డేలకు అతడిని ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్ సాధిస్తే మూడో వన్డేకు అందుబాటులో ఉంటాడు. ఒకవేళ అక్షర్ గాయాల నుంచి కోలుకోకపోతే ప్రపంచకప్‌ జట్టులో అతడి స్థానం కోసం వాషింగ్టన్ సుందర్‌, అశ్విన్ మధ్య పోటీ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు