IND vs AUS: పంత్‌ లేని లోటు శ్రేయస్‌ తీరుస్తాడు: అశ్విన్‌

భారత టెస్టు జట్టులో రిషభ్‌పంత్‌ లేని లోటు శ్రేయస్‌ అయ్యర్‌ తీరుస్తాడని రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 04 Feb 2023 17:18 IST

 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టెస్టు జట్టులో రిషభ్‌పంత్‌ లేని లోటు శ్రేయస్‌ అయ్యర్‌ తీరుస్తాడని రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు. గత ఏడాది బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో శ్రేయస్‌ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో 422 పరుగులు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రెండో భారీ స్కోరు అతడిదే. మొదటి స్థానంలో రిషభ్‌పంత్ (680) ఉన్నాడు. గతేడాది వన్డేల్లో 724 పరుగులు సాధించి 2022 సంవత్సరానికి ఐసీసీ ఉత్తమ వన్డే జట్టు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గతేడాది డిసెంబరులో రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీకి పంత్‌ అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో గతేడాది సిరీస్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయస్‌ అయ్యర్ తప్పకుండా పంత్‌లేని లోటును భర్తీ చేస్తాడని అశ్విన్‌ పేర్కొన్నాడు.

‘‘గత రెండేళ్ల నుంచి రిషభ్‌పంత్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టు జట్టులో ఆడుతున్నాడు. అప్పటి నుంచి అతడు జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. టెస్టుల్లో శ్రేయస్‌ అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పడం నిజంగా అతడిని తక్కువగా పొగడడమే అవుతుంది. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కి అతడు వెన్నుముక లాంటివాడు. పంత్‌ లేని లోటును అతడు కచ్చితంగా తీరుస్తాడు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌ తుది జట్టులో శ్రేయస్‌కు స్థానం దక్కడం అనుమానమే. కొంతకాలంగా వెన్నుగాయంతో బాధపడుతున్న శ్రేయస్‌ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి దూరంగా ఉన్నాడు. ఇటీవల జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA)లో మళ్లీ ప్రాక్టీసు మొదలుపెట్టాడు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని