Ashwin :ఆ ఇద్దరు బ్యాటర్లతో పోటీ పడటం ఇష్టం: అశ్విన్‌

 టీ20 లీగ్‌లో ఆ ఇద్దరు బ్యాటర్లను ఎదుర్కోవడం చాలా ఇష్టమని..

Updated : 01 Apr 2022 18:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో ఇద్దరు బ్యాటర్లను ఎదుర్కోవడం చాలా ఇష్టమని టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ తెలిపాడు. టీ20 లీగ్‌ వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం యువ క్రికెటర్లకు వచ్చిందన్నాడు. ప్రస్తుత సీజన్‌లో అశ్విన్ రాజస్థాన్‌ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ‘‘నిజం చెప్పాలంటే టీ20 లీగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎదుర్కోవడం చాలా ఇష్టం. వారిద్దరూ నాణ్యమైన బ్యాటర్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో వారితో డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకున్నా. దేశవాళీ టీ20 లీగ్‌లో మాత్రం ప్రత్యర్థిగా బరిలోకి దిగా. అందుకే ఆ ఇద్దరితో పోటీ పడటం నాకెంతో నచ్చింది. అంతేకాకుండా వారిద్దరూ బౌలర్లకు లొంగేందుకు ఇష్టపడరు. అందుకే కోహ్లీ, రోహిత్‌తో పోటీ అంటే ఇష్టపడతా’’ అని అశ్విన్‌ వివరించాడు. టీ20 లీగ్‌లో భాగంగా ముంబయి, రాజస్థాన్‌ జట్ల మధ్య శనివారం (ఏప్రిల్ 2) మ్యాచ్‌ జరగనుంది. 

సూర్యకుమార్‌ వచ్చేస్తున్నాడు!

రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్ జట్టులోకి వచ్చేస్తున్నాడు. దీంతో ముంబయి మిడిలార్డర్‌ బలోపేతం అవుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. హైదరాబాద్‌ మీద భారీ విజయంతో రాజస్థాన్‌ హుషారుగా ఉంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ముంబయి ఓటమి చవిచూసింది. ఓపెనింగ్ బాగున్నా.. మిడిలార్డర్‌లో పరుగులు చేయడంలో ముంబయి విఫలం కావడంతో భారీ స్కోరు చేసే అవకాశం చేజారింది. బౌలింగ్‌లోనూ బుమ్రా (3.2-0-43) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కుర్రాళ్లు బసిల్ థంపి (3/35), మురుగన్‌ అశ్విన్ (2/14) మాత్రమే రాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని