Ashwin: వాసన చూసి జెర్సీని పసిగట్టిన అశ్విన్‌.. నవ్వులు పంచుతున్న వీడియో!

రవిచంద్రన్‌ అశ్విన్‌ గ్రౌండ్‌లో ఉన్న జెర్సీలను వాసన చూసి, తనదో కాదో నిర్ధారించుకుంటూ వీడియోలో కనిపించారు. మ్యాచ్‌ సందర్భంగా అప్పుడు గుర్తించలేకపోయినా, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

Published : 09 Nov 2022 01:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా, మైదానంలో ఆటగాళ్లు, స్టాండ్స్‌లో ప్రేక్షకులు చేసే కొన్ని విషయాలు భలే ఆసక్తిగా అనిపిస్తాయి. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గమనించలేని విషయాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. టీమ్‌ ఇండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగవైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ దశలో భారత్‌-జింబాబ్వేల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

మ్యాచ్‌ ముందు టాస్‌ వేసే కార్యక్రమం జరుగుతుండగా, అప్పటివరకూ ప్రాక్టీస్‌లో ఉన్న కొందరు ఆటగాళ్లు మైదానం వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ గ్రౌండ్‌లో ఉన్న జెర్సీలను వాసన చూసి, తనదో కాదో నిర్ధారించుకుంటూ వీడియోలో కనిపించారు. మ్యాచ్‌ సందర్భంగా అప్పుడు గుర్తించలేకపోయినా, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ‘ఇది దుస్తులను గుర్తించే అసలైన మార్గం’ అంటూ ఓ నెటిజన్‌ ఆ వీడియోను పంచుకున్నాడు. దీంతో  ఈ వీడియో ఇప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ‘చాలా మంది చేసే పని ఇదే’, ‘శీతాకాలంలో దుస్తులు ఉతకాల్సి వచ్చినప్పుడు ఇదే టెక్నిక్‌ నేనూ వాడతా’, ‘భారత్‌లో ఇది మామూలు విషయం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు  ఈట్వీట్‌ చూసిన అశ్విన్‌ కూడా స్పందించాడు.

‘‘సైజును బట్టి వేరు చేయడానికి కాదు.. అదే మొదటిసారి వేసుకుందా? అని పరిశీలించడానికి కాదు. ఎందుకంటే, నేను వాడే పెర్ఫ్యూమ్‌ అదేనా అని చెక్‌ చేస్తున్నా.. అరే.. కెమెరామెన్‌’’అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్‌ విజయం సాధించి, టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని