Virat Kohli: ‘‘ఒక్కసారి విరాట్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తే..’’

విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అక్కర్లేదని భారత మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఓపెనర్‌గా కాకుండా తనకు అచ్చొచ్చే వన్‌డౌన్‌లో పంపిస్తే మెరుగైన ఆటతీరు బయటకొస్తుందని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

Updated : 20 Jun 2024 16:38 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్‌కు ఉన్న ఏకైక ఆందోళన విరాట్ కోహ్లీ ఆటతీరు గురించే. ఐపీఎల్‌లో అదరగొట్టిన అతడు ఈసారి మాత్రం ఘోరంగా విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పుడు కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే, అతడిని వన్‌డౌన్‌లో పంపిస్తే మంచిదని భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. రిషభ్‌ పంత్‌ లేదా యశస్విని ఓపెనర్‌గా తీసుకొస్తే బెటరని వ్యాఖ్యానించాడు. 

‘‘ఇతర ప్లేయర్ల మాదిరిగా తనపై ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోహ్లీ త్వరగా కోల్పోడు. ‘నన్ను మళ్లీ నెంబర్‌ 3 స్థానంలో తీసుకొస్తే.. నేనేంటో మీకు చూపిస్తా’ అని విరాట్ ఘంటాపథంగా చెప్పగలడు. అతడి బ్యాటింగ్ సత్తా ఏంటో మనకు తెలుసు’’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో చర్చ సందర్భంగా తెలిపాడు. ఇదే కార్యక్రమంలో భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా ఉన్నాడు.

మానసికంగా చాలా బలవంతుడు: ఉతప్ప

‘‘ విరాట్ కోహ్లీ మానసిక స్థితిని అంచనా వేయడం చాలా కష్టం. భారత్‌ లీగ్‌ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్‌ను వర్షం కారణంగా ఆడలేకపోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ సహచరులతో కలివిడిగా మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా ఇతర ప్లేయర్లు విఫలమైనప్పుడు చాలా మూడీగా ఉంటారు.  కానీ, విరాట్ ఆత్మవిశ్వాసం ఉన్నతస్థాయిలో ఉంటుంది. ఇది కేవలం గ్యాప్‌ మాత్రమేనని అతడికి తెలుసు. తప్పకుండా తన సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తాడు’’ అని ఉతప్ప తెలిపాడు.

ఓపెనర్లు రాణిస్తేనే..: లారా

‘‘సూపర్-8లో ఓపెనర్ల పాత్ర అత్యంత కీలకం. తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలో కనీసం 60 పరుగులు చేస్తే ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. భారత్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ దూకుడుగా ఆడగల సత్తా ఉన్నవాళ్లే. కనీసం ఒక్కరు యాంకర్‌ పాత్రను పోషించినా చాలు. వీరిద్దరి ఫామ్‌ అత్యంత కీలకం. మిగతా బ్యాటర్లు రాణించాలంటే ఓపెనింగ్ పార్టనర్‌షిప్‌ బలంగా ఉండాలి’’ అని విండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్‌ లారా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని